వేగమే ఉసురు తీసింది..
● ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
● రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఘటన
● ఎదురెదురుగా వచ్చి ద్విచక్ర వాహనాల ఢీ
తాళ్లపూడి: కమ్ముకున్న చీకటి, ఆపై వేగమే ఉసురు తీసింది.. ముగ్గురి ప్రాణాలను కబళించింది.. సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పట్టణ సీఐ విశ్వం కథనం ప్రకారం.. కొవ్వూరు పట్టణంలోని బ్రిడ్జిపేట, శ్రీనివాసపురం, గ్యాస్ కంపెనీ ప్రాంతాలకు చెందిన యువకులు కూతిగుంట అక్షయ్‌కుమార్ (20), తగరపు సత్యకల్యాణ్ (20), కొమ్మిరి ఏడుకొండలు (18) స్నేహితులు. వీరు మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరంలో సినిమా చూసేందుకు రాత్రి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్‌కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఒకరికొకరు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కూతికుంట అక్షయ్‌కుమార్ (20), తగరపు సత్యకల్యాణ్ అనే సునీల్ (20), రాజమహేంద్రవరానికి చెందిన ఆనపు లక్ష్మీనారాయణల తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు స్నేహితుల్లో మోటారు సైకిల్‌పై వెనుక కూర్చున్న కొమ్మిరి ఏడుకొండలుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అక్షయ్‌కుమార్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆపరేషన్ జరగడంతో ఉదయం రాజమహేంద్రవరం వచ్చి చికిత్స చేయించుకుని రాగా, మళ్లీ రాత్రి స్నేహితులతో కలసి ఒకే మోటార్ సైకిల్‌పై వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సంఘటనా ప్రాంతం హృదయ విదారకంగా మారింది. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను పట్టణ సీఐ విశ్వం, పోలీసులు తరలించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంతో బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అదే కారణమా!
రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై మరమ్మతులు జరుగుతున్నాయి. అంతేకాకుండా బ్రిడ్జిపై లైట్లు అక్కడక్కడే మాత్రమే వెలుగుతున్నాయి. చీకటి, అలాగే అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా ప్రాంతంలో మూడు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో భయానకంగా మారింది.
వేగమే ఉసురు తీసింది..
వేగమే ఉసురు తీసింది..
వేగమే ఉసురు తీసింది..


