నయనానందం.. స్వామివార్ల తెప్పోత్సవం
సఖినేటిపల్లి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం సోమవారం నేత్ర పర్వంగా సాగింది. స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజు ఆలయానికి ఉత్తరం వైపునున్న చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లు విహరించారు. తొలుత సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై అర్చకులు కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. 6 గంటలకు తెప్పోత్సవం నిర్వహించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. మూడు పర్యాయాలు చెరువు చుట్టూ బాణసంచా కాల్పుల మధ్య జరిగిన శ్రీస్వామివారికి హంస వాహనంపై తెప్పోత్సవం జరిపారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ద్రాక్షారామలో భీమేశ్వరస్వామికి..
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నదిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీప కాంతుల నడుమ తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణమూర్తులను వేద పండితులు ఆలయం నుంచి తోడ్కొని వచ్చి సప్త గోదావరిలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకృతమైన హంస వాహనంలో ఉంచి ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణమూర్తులకు నీరాజన మంత్ర పుష్పాలు సమర్పిస్తుండగా మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారు మూడు సార్లు నదిలో జలవిహారం చేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నయనానందం.. స్వామివార్ల తెప్పోత్సవం


