అతిథిలా వచ్చి వెళ్తున్న పవన్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఏటా సంక్రాంతి సంబరాలు జరుపుకొంటున్నామని, అటువంటిది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి కొత్తగా ఈ సంబరాలు నిర్వహించడమేమిటని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. కాకినాడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పవన్.. ఇక్కడకు ఓ అతిథిలా వచ్చి, వెళ్తున్నారని విమర్శించారు. కీలకమైన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని కాకుండా.. తన మాట వినే డమ్మీ అధికారులను ఎంపీ సానా సతీష్ నియమిస్తున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరానికి ఐఏఎస్‌ను నియమించి, కాకినాడలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నగరం ప్రస్తుతం చాలా అధ్వానంగా తయారైందని అన్నారు. ఓఎన్‌జీసీ నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ప్రాణాలతో ఆ సంస్థ చెలగాటమాడుతోందని ఆరోపించారు.
సామ్రాజ్యవాద అహంకారంతో చిన్నచిన్న దేశాలపై ఆర్థిక, సైనిక, వైమానిక దాడులకు పాల్పడుతూ ప్రపంచ శాంతికి అమెరికా ముప్పుగా మారిందని మధు అన్నారు. వివిధ అంతర్జాతీయ సమస్యలను సాకుగా చూపుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురోను, ఆయన భార్య సిలియో ఫ్లోర్స్‌ను అరెస్టు చేసి నిర్బంధించడం ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిపై చేసిన ఘోర దాడిగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ట్రంప్ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, మన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికై నా ట్రంప్ విధానాలను ప్రధాని మోదీ ఖండించాలని, అమెరికా సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు వచ్చే నెల 16 ,17, 18 తేదీల్లో కాకినాడలో నిర్వహిస్తున్నట్లు మధు తెలిపారు. అలాగే, సీపీఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ జరగనుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలూ తరలి రావాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, సాక రామకృష్ణ, టి.అన్నవరం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ పాల్గొన్నారు.
ఫ కొత్తగా ఆయన సంక్రాంతి
సంబరాలు జరపడమేమిటి?
ఫ సీపీఐ నేత మధు విమర్శ


