కస్సుబస్సులు! | - | Sakshi
Sakshi News home page

కస్సుబస్సులు!

Jan 8 2026 7:09 AM | Updated on Jan 8 2026 7:09 AM

కస్సు

కస్సుబస్సులు!

బస్‌స్టాప్‌లో నిలపకపోతే చర్యలు

బస్సులను తప్పనిసరిగా బస్‌స్టాప్‌లో నిలపాలని డ్రైవర్లందరికీ ఆదేశాలు జారీ చేశాం. బస్సులు నిలపడం లేదని మాకు పలు ఫిర్యాదులు అందాయి. బస్సులు ఖాళీగా ఉంటే తప్పనిసరిగా ఆయా స్టాప్‌లలో నిలిపే విధంగా చర్యలు చేపడతాం.

– ఎంవీయూ మనోహర్‌,

ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్‌

ఆపడం లేదు

నేను వేట్లపాలెం స్కూల్‌లో పని చేస్తున్నాను. ప్రతి రోజూ కాకినాడ నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తూంటాను. చాలా సందర్భాల్లో బస్సులను బస్‌ స్టాప్‌లో నిలపడం లేదు. బస్‌ స్టాప్‌కు దూరంగా నిలిపి, కేవలం ప్రయాణికులను దించుతున్నారే తప్ప బస్సు ఎక్కేందుకు అవకాశం ఇవ్వడం లేదు.

– చోడిశెట్టి సుబ్రహ్మణ్యం, టీచర్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉంది ప్రభుత్వం తీరు. సరైన కసరత్తు లేకుండా.. సర్వీసుల సంఖ్య పెంచకుండానే.. సర్కారు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో, మహిళలు పల్లెవెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనే బయలుదేరుతున్నప్పటికే బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతూండటంతో సాధారణ ప్రయాణికులు బస్సు ఎక్కలేక.. ఎక్కినా సీటు దొరకక నానా అగచాట్లూ పడుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా.. తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు.

బస్సులు తక్కువ.. ప్రయాణికులు ఎక్కువ

కాకినాడ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 55 ఉన్నాయి. ఆయా మార్గాల్లో ఈ బస్సులలో ప్రతి రోజూ 25 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేయక ముందు ఈ బస్సుల్లో 15 వేల నుంచి 18 వేలలోపు మాత్రమే ప్రయాణికులుండేవారు. అటువంటిది ఇప్పుడు ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. సాధారణంగా ఒక బస్సులో 52 సీట్లు ఉంటాయి. మరో 15 మంది వరకూ నిలబడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఉచిత బస్సు పథకం అమలయిన దగ్గర నుంచి బస్సులో సుమారు 80 నుంచి 90 మంది వరకూ ఎక్కుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, బస్‌స్టాప్‌లలో బస్సుల కోసం గంటల తరబడి నిలబడటం.. వచ్చిన బస్సు కాస్తా రద్దీగా ఉండటంతో సాధారణ ప్రయాణికులు నానా అవస్థలూ పడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతూండటంతో బస్సులు తరచూ పాడవుతున్నాయని పలువురు డ్రైవర్లు డిపో మేనేజర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు.

మార్గం మధ్యలో మరిన్ని ఇక్కట్లు

బయలుదేరిన చోటనే బస్సులు కిక్కిరిసిపోతూండటంతో మార్గం మధ్యలోని గ్రామాల్లో వేచి ఉంటున్న ప్రయాణికులు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడూ వస్తున్న బస్సులు రద్దీగా ఉండటం.. వాటిని డ్రైవర్లు ఆపకపోవడంతో నానా అగచాట్లూ పడుతున్నారు. ఒకవేళ ఆపినా కిటకిటలాడుతున్న బస్సులోకి ఎక్కలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో మార్గం మధ్యలోని గ్రామాల్లో ఉచిత ప్రయాణానికి ఆశ పడుతున్న మహిళలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ నుంచి దివిలి, కిర్లంపూడి, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాలకు బస్సులు సక్రమంగా ఉండటం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

విద్యార్థులకు యాతన

మరోవైపు ఉచిత బస్సు పథకంతో విద్యార్థులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. సంవత్సరానికి సరిపడా బస్‌ పాస్‌ తీసుకోవడంతో వారు ఆర్టీసీ బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఆటోల్లో వెళ్లడానికి ఆర్థిక పరిస్థితి సహకరించని దుస్థితి వారిది. దీంతో, నెలవారీ ఆర్టీసీ బస్‌ పాస్‌లు తీసుకున్నప్పటికీ రద్దీగా ఉండటంతో బస్సులు ఎక్కలేకపోతున్నామని, కొన్నింటిని డ్రైవర్లు ఆపడం లేదని వాపోతున్నారు. స్కూల్‌కు వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు చాలా అవస్థలు పడుతున్నామని, తమకు ప్రత్యేకంగా బస్సులు వేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

బస్సులను పెంచని ప్రభుత్వం

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని గొప్పగా డప్పేసుకుంటున్న ప్రభుత్వం సాధారణ ప్రయాణికుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో టికెట్టు తీసుకుని బస్సు ఎక్కిన వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. టికెట్టు లేకపోవడంతో మహిళలు సీట్లు ఖాళీ లేకపోయినా నిలబడి అయినా ప్రయాణం చేస్తున్నారు.

కానీ, మగవారు టికెట్లు తీసుకుని, కూర్చునేందుకు కూడా చోటు లేకపోవడంతో అగచాట్లు ఎదుర్కొంటున్నారు. రద్దీ కారణంగా చాలా సందర్భాల్లో మగవారు కూర్చునేందుకు బస్సులో కనీసం సీటు దొరకని పరిస్థితి నెలకొంటోంది. కొన్ని బస్సులలో కనీసం నిలుచునేందుకు కూడా జాగా ఉండటం లేదు. దీంతో, సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తరచుగా తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఒక్కోసారి రెండు మూడు గంటల పాటు నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం, అమలాపురం, తుని వంటి ప్రాంతాలకు వెళ్లే వారి అవస్థలు వర్ణనాతీతం.

ఫ కిటకిటలాడుతున్న ‘ఫ్రీ బస్సు’

ఫ నిండా మహిళలే..

ఫ పురుషులకు,

విద్యార్థులకు దొరకని సీటు

ఫ సాధారణ ప్రయాణికులకు నరకయాతన

కస్సుబస్సులు!1
1/2

కస్సుబస్సులు!

కస్సుబస్సులు!2
2/2

కస్సుబస్సులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement