వక్క సాగు రైతులకు లాభసాటి
కపిలేశ్వరపురం (మండపేట): వక్క సాగు చేయడం ద్వారా రైతులు లాభాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనికోసం రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి అన్నారు. మండపేట మండలం వేములపల్లిలోని భవానీ గార్డెన్స్‌లో సోమవారం శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వక్క రైతుల సదస్సు నిర్వహించారు. స్థానికంగా వక్క సాగుకు ఉన్న సానుకూల అంశాలను రైతులకు వివరించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది రైతులు హాజరయ్యి తమ అనుభవాలను వెల్లడించారు. స్థానిక పంటలను పరిశీలించారు. సీపీసీఆర్‌ఐ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప మాట్లాడుతూ వక్క వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే అన్నారు. ఆదర్శ రైతు చిలుకూరి దొరయ్య చౌదరి సేద్య ప్రస్థానంపై రాసిన సృజనాత్మక రైతు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.


