కోటసత్తెమ్మ నిండుగా.. కనుల పండువగా..
● వైభవంగా ముగిసిన
అమ్మవారి తిరునాళ్లు
● అలరించిన బాణసంచా వెలుగులు
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న తిరునాళ్లు సోమవారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ పర్యవేక్షణలో ఆలయం వద్ద ఉదయం చండీపారాయణ, సాయంత్రం హోమాలు, ఊయలసేవ నిర్వహించారు. ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ కోటసత్తెమ్మకు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూల గరగలు ఆకట్టుకున్నాయి. విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయి మేళం, గరగ నృత్యాలు, నందన డ్యాన్స్ ఆకాడమీ తణుకు వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కేరళ చందామేళం, కాళికా డ్యాన్స్, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భారీగా బాణసంచా కాల్చడంతో ఆలయ పరిసరాలు వెలుగులు విరజిమ్మాయి. అమ్మవారిని దర్శించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి గరగలు ఎత్తుకున్నారు.


