వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్య దారుణం
కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ, దళిత నాయకుడు కాకర అప్పారావును టీడీపీకి చెందిన కూళ్ల రాజబాబు తన సోదరుడు, మరికొంత మందితో కలసి, హత్యచేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం అన్నారు. వీరవరంలో ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ భూపాలపట్నం దళితపేటలో వైఎస్సార్ సీపీలో రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరంరెడ్డి కాశీబాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న కూళ్ల రాజబాబు, అతని సోదరుడు కూళ్ల రాజేష్ మరికొంతమందితో హత్యకు కారణమయ్యాడని తెలిపారు. పోలీసు అధికారులు దీనిని దృష్టిలో వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత కూళ్ల రాజబాబును అరెస్టు చేసి, మరో నిందితుడు దొరకలేదని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. రాజకీయ కక్షతో ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. మెట్ట ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ మార్చి అసలైన నిందితులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో పార్టీ తరఫున న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, నాయకులు తోట బాబ్జీ, గుల్ల ఏడుకొండలు, రామకుర్తి మూర్తి, తోట అయ్యన్న, అరిశ సత్యనారాయణ, ఓలేటి రాజు, గంగరాజు పాల్గొన్నారు.


