చేప పిల్లలను మింగేశారు
● మత్స్యకారుల సంతకాలు ఫోర్జరీ చేశారు
● మత్స్యకారుల సంఘ నాయకుల ఆరోపణ
ధవళేశ్వరం: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో గోదావరిలో విడుదల చేసినట్లు చెబుతున్న చేప పిల్లలను వదలకుండా ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను జిల్లా మత్స్యశాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నార ని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకారుల కులా ల సమాఖ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కరుకు ఇ మ్మానియేల్ ఆరోపించారు. ధవళేశ్వరం బోట్‌మెన్, ఫిషర్‌మెన్ సొసైటీ నాయకులతో కలిసి సోమవా రం విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో చేపపిల్లలను మత్స్యశాఖ అధికారులు గోదావరిలో విడుదల చేశారన్నారు. మొత్తం 52లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారని, వాస్తవానికి కేవలం 30వేల చేపపిల్లలను మత్రమే విడుదల చేశారన్నారు. మత్య్సకారుల జీవనోపాధి పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన గోదావరిలో చేపపిల్లల విడుదలను చేపట్టకుండా విడుదల చేసినట్లు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. రికార్డులలో మత్స్యకారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి చేప పిల్లలను మింగేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధవళేశ్వరం బోట్‌మెన్, ఫిషర్‌మెన్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మెరుగ సత్తిబాబు, ఉపాధ్యక్షుడు సావదాల కామేశ్వరరావు, కార్యదర్శి కరుకు హరిప్రసాద్, కోశాధికారి బొడ్డు శ్రీను డిమాండ్ చేశారు.


