సొసైటీలకు తాళాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘ ఉద్యోగులు సోమవారం జిల్లాలోని అన్ని సహకార సంఘాలు మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చేశారు. జిల్లాలో ఉన్న 71 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులు యూనియన్ పిలుపు మేరకు డీసీసీబీ బ్రాంచ్‌ల వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అన్ని సహకార సంఘాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కాకినాడ జిల్లాలో సహకార సంఘాల ద్వారా ప్రతీ రోజు సుమారు రూ.40 కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయి. సమ్మె కారణంగా ఆయా లావాదేవీలు నిలిచిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో 71 సహకార సంఘ పరిధిలో 1.80 లక్షల మంది సహకార సంఘ సేవలు వినియోగించుకొంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వచ్చారు. సహకార సంఘాలకు తాళాలు వేసి ఉండడంతో ఊసురుమంటూ వెనుతిరిగి రావాల్సి వచ్చింది. ప్రతీ సహకార సంఘానికి ప్రతీ రోజూ 30 నుంచి 50 మందికి పైగా రైతులు వచ్చి లావాదేవీలు జరుపుతారు. ప్రతీ సహకార సంఘంలో నిత్యం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతుంటాయి. సామర్లకోట మండలం నవర సహకార సంఘం పరిధిలో ప్రతీ రోజూ రూ.18 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రతీ రోజు 35 మంది రైతులు ఇక్కడ సహకార సంఘాలు సేవలు వినియోగించుకొంటారు.
బంగారంపై రుణాలు తీసుకొనే
రైతులకు అవస్థలు
రైతులు బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకొంటారు. రూ.88 పైసల వడ్డీకే సహకార సంఘాల్లో రైతులకు రుణాలు ఇస్తుంటారు. దీంతో రైతులు అధికంగా బంగారు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందుతారు. సోమవారం సహకార సంఘాల్లో సిబ్బంది లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య బ్యాంకులు చాలా తక్కువగా ఉంటాయి. మండల కేంద్రాల్లో తప్ప వేరే గ్రామాల్లో వాణిజ్య బ్యాంకులు దాదాపు లేవు. దీంతో రైతులు తమ అవసరాల కోసం ఎక్కువగా సహకార సంఘాలను వినియోగించుకొంటారు. కానీ ధర్నా కారణంగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు పడ్డ బాధలు వర్ణనాతీతం.
డిమాండ్లు ఇవే..
వేతన సవరణ చేపట్టాలి, అప్పటి వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి.
ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీకి సీలింగ్ విధించి రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. అలా కాకుండా గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసి చెల్లింపులు చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ప్రతీ ఉద్యోగికి రూ.20 లక్ష టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలను డ్యూ టు పద్దులో ఉంచారు. ఈ డ్యూ టు పద్దులను రద్దు చేయాలి.
2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి జీవో నంబర్ 36 అమలు చేయాలి.
డీసీసీబీల ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకార సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6 శాతం డివిడెండ్, కనీస వడ్డీ 6 శాతం చెల్లించాలి.
ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్‌లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి.
71 సహకార సంఘాల్లో నిలిచిన సేవలు
సమస్యల పరిష్కారం
కోరుతూ ఉద్యోగుల ధర్నా
ఆందోళనలో పాల్గొన్న 220 మంది
ఒక్కరోజుకు నిలిచిన లావాదేవీలు రూ.40 కోట్లు
అవస్థలు పడ్డ రైతులు
సొసైటీలకు తాళాలు


