నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది | - | Sakshi
Sakshi News home page

నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది

Dec 9 2025 9:25 AM | Updated on Dec 9 2025 9:25 AM

నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది

నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది

సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ

అల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): లక్క ఇంటిలో పంచపాండవులు కుంతితో సహా దహనమయ్యారన్న వార్త విని ధృతరాష్ట్రుడు బిగ్గరగా ఏడిచాడు. సహజంగా ఏడిచేవాడి ఏడుపు కన్నా, నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. వేదవ్యాస భారతంపై ఆయన హిందూ సమాజంలో సోమవారం 12వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. ధృతరాష్ట్రుడు వారణాశికి పాండవులను పంపడానికి గల కారణాలను ఆయన వివరించారు. అర్జునుడు భీముని తోడుగా తీసుకుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ధర్మరాజు యశస్సు నింగినంటుతోంది, పాండు సుతుల విజయగాథలను ప్రజలు వేనోళ్లా ప్రశంసించడం ఆయనకు కంటగింపయింది. అసూయతో రగిలిపోయాడు. ఆ సందర్భంగా కణికుడు అనే మంత్రిని పిలిపించి, తాను యుధిష్టరునితో సంధి చేసుకోవాలా, సంగ్రామానికి సిద్ధపడాలా అని ప్రశ్నిస్తాడు. కణికుడు రాజనీతిని ఉపదేశిస్తాడు–శత్రువును ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదు. తన కన్నా బలవంతుడయితే, అతనిని కానుకలతో మంచి చేసుకోవాలి, వినయశీలుడిలా శత్రువు వద్ద నటించాలి, అదను చూసి దెబ్బతీయాలి. శత్రువు తన కన్నా బలహీనుడయి శరణుజొచ్చినా, ఉపేక్షించరాదని కణికుడు చెబుతాడు. దుర్యోధనాదుల ఆలోచనలకు ఆమోదం తెలిపి, పాండవులను వారణావత నగరానికి పంపుతాడని సామవేదం అన్నారు. కౌరవుల కుటిల నీతిని పసిగట్టిన విదురుడు సంకేత పదాలతో ధర్మరాజును అప్రమత్తం చేస్తాడు. కార్చిచ్చు అడవిని దహనం చేసినా, కలుగులోని ఎలుకకు అపాయం ఉండదని, రాత్రివేళ సైతం పాండుసుతులు అప్రమత్తులయి, పరిసరాలను గమనించాలని హితవు చెబుతాడు. సుయోధనుడు పురోచనుడు అనే విశ్వాసపాత్రుడిని పిలిచి, లక్కయింటిని నిర్మించమని, అదను చూసి నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. అయితే పురోచనుడి ఆలోచనను పసిగట్టిన పాండవులు ఒక రాత్రివేళ లక్క ఇంటికి తామే నిప్పు అంటించి, కలుగు మార్గం ద్వారా అడవుల్లోకి వెడతారని సామవేదం వివరించారు. ‘దుర్యోధనుడు’, ‘దుశ్శాసనుడు’ వంటి చెడు పేర్లను వ్యాసుడు ఎంత పక్షపాతి అయినా, ఎలా పెట్టాడని కొందరు అడుగుతారు. ఆ పదాలకు సరి అయిన అర్థాలను తెలుసుకోవాలి, దుర్భేద్యము అన్న పదం లాగే, దుర్యోధనుడు అంటే ఓడించడానికి వీలు పడని పరాక్రమం కలవాడని, దుశ్శాసనుడు అంటే శాసించడానికి వీలు పడని వాడనీ అర్థమని సామవేదం అన్నారు విదురుడు ఇంగితజ్ఞుడు, లాక్షాగృహ దహనంలో పాండుసుతులు అగ్నిపాలు కాకుండా విలువైన సూచనలు ఇవ్వడమే కాకుండా, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక విశ్వాసపాత్రుడిని పంపాడని ఆయన అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్‌ నారాయణరావు సభకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement