కదలివచ్చిన జనకోటి
ఇది ఆరంభం మాత్రమే
చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిలువెత్తు నిదర్శనం కోటి సంతకాల సేకరణ నూరు శాతం విజయవంతం కావడం. ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 4 లక్షలకు పైబడి వచ్చిన సంతకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రజాధనంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడమనేది దేశంలో ఎప్పుడూ వినలేదు. ప్రజల సొమ్ముతో పూర్తయ్యే దశలో ఉన్న మెడికల్ కళాశాలలను సొంతవారికి దోచిపెట్టే కుట్రను గ్రామగ్రామానా ప్రజలు తమ సంతకాలతో తిరస్కరించారు. ఇది ఆరంభం మాత్రమే. పాలన ఇలాగే కొనసాగితే ప్రజాందోళన ఉధృతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.
– దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ఉద్యమంలా సంతకాల సేకరణ
పార్టీలకతీతంగా ప్రజలు ప్రధానంగా యువతీయువకులు, విద్యార్థులు కోటి సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేదలకు వైద్య విద్యను దూరంచేసే చంద్రబాబు కుయుక్తులను ప్రజలు ఛీత్కరించుకుంటున్న విషయం ఈ సందర్భంగా ప్రస్ఫుటమైంది. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని పార్టీ కార్యకర్తలు, నేతలు ఉద్యమంలా సంతకాలు సేకరించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చూస్తూంటే చంద్రబాబు పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ
ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని.. ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను చాటారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ ఉద్యమాన్ని నూరు శాతం విజయవంతం చేశారు.
ఉద్యమించారిలా..
కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంపై వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. అది మొదలు దాదాపు రెండు నెలలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన నేతలు, కార్యకర్తలు సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, అనుయాయులకు దోచిపెట్టే ఎత్తులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్లను సమన్వయం చేసుకుంటూ సంతకాల సేకరణను విజయవంతం చేయడంలో కృతకృత్యులయ్యారు. కో ఆర్డినేటర్లు, ఆయా నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుండి నడిపించారు. చంద్రబాబు పాలన తీరుపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావడం కలసి వచ్చింది. యువత, విద్యార్థులు, మేధావులు.. ఇలా ఎవరిని కదిపినా కోటి సంతకాల ఉద్యమం పైనే ప్రధాన చర్చ జరిగింది. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను కట్టలుగా కట్టి, పెట్టెల్లో భద్రపరచి, పార్టీ నేతలు బుధవారం ర్యాలీగా కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తుని
కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా అక్టోబర్ 16న తొండంగి మండలం పెరుమాళ్లపురంలో శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 54 పంచాయతీలు, తుని పట్టణంలోని 30 వార్డుల్లో సంతకాల సేకరణ నూరు శాతం పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 60 వేల సంతకాలు లక్ష్యం కాగా, తుని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన రచ్చబండ ద్వారా నూరు శాతం పూర్తి చేశారు.
కాకినాడ రూరల్
పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అక్టోబర్ 16న తూర్పు సెంటిమెంటుగా నేమాం గ్రామం నుంచి కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఆ మర్నాటి నుంచి నియోజకవర్గంలోని 41 గ్రామ పంచాయతీలు, కాకినాడ సిటీలోని 8 డివిజన్లలో స్థానిక నాయకులు ఉత్సాహంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. 60 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం ద్వారా ప్రైవేటీకరణపై తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. మిగిలి ఉన్న కొద్దిపాటి సంతకాలను బుధవారం పూర్తి చేయనున్నారు.
పిఠాపురం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. లక్ష్యానికి అనుగుణంగా 50 వేల సంతకాలను మంగళవారం నాటికే విజయవంతంగా పూర్తి చేశారు. పిఠాపురం 1, 30 వార్డుల్లో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 50 వార్డులు, 60 గ్రామాల్లో సంతకాలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. గ్రామ కమిటీల నేతలు సైతం వీధుల్లో పర్యటిస్తూ సంతకాలు సేకరించారు. పిఠాపురం పట్టణంలో మూడు వార్డులు కలిపి ఉన్న జగ్గయ్య చెరువులో సంతకాల సేకరణను ముగించారు.
జగ్గంపేట
మాజీ మంత్రి తోట నరసింహం కో ఆర్డినేటర్‌గా జగ్గంపేట నియోజకవర్గంలో 90 శాతం సంతకాలు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసే పనిలో పార్టీ శ్రేణులు తలమునకలై ఉన్నాయి. మంగళవారం నాటికి 72 గ్రామాల్లో 50 వేల సంతకాలు పూర్తి చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం తోట శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా చివరి దశకు చేరుకుంది.
కాకినాడ సిటీ
పార్టీ శ్రేణులు, ప్రజలు, విభిన్న వర్గాల మేధావులు పెద్ద ఎత్తున తరలి రాగా స్థానిక బాలాజీ చెరువు సెంటర్‌లో వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంతకాల సేకరణను ప్రారంభించారు. మొత్తం 42 డివిజన్లలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ తమతమ క్లస్టర్ల పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, పార్టీ నేతలను సమన్వయం చేసుకుని, 60 వేల సంతకాల లక్ష్యాన్ని పూర్తి చేశారు. కాకినాడ జగన్నాథపురంలో ఈ కార్యక్రమం ముగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ పరిశీలకుడు విప్పర్తి వేణుగోపాలరావు వెన్నంటి నిలిచారు.
పెద్దాపురం
నియోజకవర్గంలో సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలకు అక్టోబర్ 10న సామర్లకోటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన శ్రీకారం చుట్టారు. అదే రోజు సాయంత్రం పెద్దాపురం మున్సిపాలిటీ 13వ వార్డు నుంచి సంతకాల సేకరణ ప్రారంభించారు. నియోజకవర్గలోని జంట మున్సిపాలిటీలతో పాటు రూరల్ మండలాల్లో పోటాపోటీగా సంతకాలు సేకరించారు. మంగళవారం ఉదయానికి 50 వేల సంతకాలు పూర్తి చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు వాసిరెడ్డి జమీలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రత్తిపాడు
కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన అక్టోబర్ 24న ప్రత్తిపాడులో సంతకాల సేకరణ ప్రారంభించారు. నియోజవర్గంలోని 75 పంచాయతీలు, ఏలేశ్వరం నగర పంచాయతీ 20 వార్డుల్లోనూ సంతకాలు సేకరించారు. లక్ష్యం 64 వేల సంతకాలకు గాను 54 వేలు పూర్తి చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం వెంట ఉన్నారు. రెండు నెలలుగా సేకరించిన సంతకాలను డిజిటలైజ్ చేస్తున్నారు.
ఫ కోటి సంతకాల సేకరణ ప్రజా
ఉద్యమానికి విశేష స్పందన
ఫ వైద్య కళాశాలల ప్రై‘వేటు’పై
సర్వత్రా ఆగ్రహం
ఫ నిర్ణయం ఉపసంహరించుకోవాలని
బాబు సర్కారుకు డిమాండ్
ఫ నేడు వైఎస్సార్ సీపీ జిల్లా
కార్యాలయానికి సంతకాల ప్రతులు
కదలివచ్చిన జనకోటి
కదలివచ్చిన జనకోటి


