హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పరాదు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పకూడదని, అది ప్రపంచానికి ప్రమాద హేతువుగా మారవచ్చని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ‘ద్రోణుడు పక్షపాతి కాడు, ధర్మజ్ఞుడు. అస్త్రాలు మంత్రస్వరూపాలు. అవి నేర్చుకోవడానికి కొన్ని వ్రతాలుంటాయి. నేర్చుకోవడానికి ఉపనయనాది సంస్కారాలు ఉండాలి’ అని చెప్పారు. ఏకలవ్యుడు నిషాదుడని, పశుపక్ష్యాదులను వేటాడటమే వృత్తిగా కలవాడని చెప్పారు. తనను చూసి మొరిగిన కుక్కపై ఏడు బాణాలు ప్రయోగించి, అది మూతి తెరవకుండా చేశాడని, ఉత్తముడు తను నేర్చుకున్న విద్యను శునకాదులపై ప్రయోగించరాదని చెప్పారు. రాజోచితమైన విద్యను బోయవానికి నేర్పడానికి ద్రోణాచార్యుడు తిరస్కరించడంలో కులవివక్ష లేదని, ఎవరో ఒకరు ప్రభుత్వ సంస్థకు వచ్చి తనకు క్షిపణుల ప్రయోగం, అణువిద్య నేర్పమంటే నేర్పుతారా? అని సామవేదం ప్రశ్నించారు. మంత్రం సిద్ధించిన తరువాతనే అస్త్రవిద్య పని చేస్తుందన్నారు. గురుముఖతః నేర్చుకున్న విద్య మాత్రమే ఫలప్రదమవుతుందని, దొంగచాటుగా నేర్చుకుంటే అది బ్రహ్మస్తేయమనే పాపంగా పరిణమిస్తుందని చెప్పారు. కురుపాండవులకు అస్త్రవిద్య నేర్పడానికి స్థాపించిన విద్యాలయం నేటి డెహ్రాడూన్ ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయన్నారు. కానీ, విదేశీయులు ఈ గడ్డ మీద ముందుగా పేర్లు మార్చారని చెప్పారు. మార్చినవి పేర్లే కదా అని కొందరు ఉదారవాదులు అంటున్నారని, అయితే, వాటినే ఎందుకు మార్చారంటూ వారిని మనం ప్రశ్నించాలని అన్నారు. ధనం కోసమే ఒక సాధనంగా విద్యను భావించడంతో క్షీణదశ ప్రారంభమైందని, కానీ, విద్య కోసమే విద్య అని భావించినది మహర్షుల కాలమని చెప్పారు. విద్యార్థుల్లో స్పర్థలుండాలే తప్ప ద్వేషభావం తగదని హితవు పలికారు. భారతం చదవడం ఒక యోగమని, తెలుసుకోవడం ఒక మహాయోగమని సామవేదం అన్నారు.


