ఈ విధులు.. సారా టార్చర్‌ | - | Sakshi
Sakshi News home page

ఈ విధులు.. సారా టార్చర్‌

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

ఈ విధులు.. సారా టార్చర్‌

ఈ విధులు.. సారా టార్చర్‌

కాకినాడ క్రైం: పొరుగు జిల్లాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఎకై ్సజ్‌ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భార్యాబిడ్డలను, కుటుంబాన్ని వదిలి.. ఊరు కాని ఊరు వచ్చి.. 15 రోజుల చొప్పున ఇక్కడే ఉంటూ వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల పక్కనే కడుపాకలి తీర్చుకుంటూ.. స్నేహితుల గదుల్లోనే తల దాచుకుంటూ సర్దుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు తమపై పెత్తనం చేయడమే తప్ప కనీస వసతులైనా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం భోజనమైనా పెట్టకపోవడం.. నిలువ నీడయినా కల్పించకపోవడం.. డ్యూటీ అడ్వాన్సులు సైతం చెల్లించకపోవడంతో రెండు నెలలుగా టార్చర్‌ అనుభవిస్తున్నామని వాపోతున్నారు.

40 మంది సిబ్బంది

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సారా తయారీ, క్రయ విక్రయాలు మితిమీరి సాగుతున్నాయంటూ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ కొద్ది రోజుల క్రితం నివేదిక అందించింది. దీంతో, ఈ రెండు జిల్లాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పొరుగు జిల్లాల నుంచి సమర్ధులైన ఎకై ్సజ్‌ సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 40 మంది సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించారు. వీరిలో ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరు ప్రతి 15 రోజులకో బ్యాచ్‌ చొప్పున రెండు జిల్లాల్లోనూ పని చేస్తున్నారు. సారా తయారీ, రవాణా, అమ్మకాలపై సమాచారం అందిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు వీరు రంగంలోకి దిగుతున్నారు. పలుచోట్ల సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను, సారా డెన్‌లను ధ్వంసం చేయడం, తయారీ, రవాణా, అమ్మకందార్లకు అరదండాలు బిగించడం వంటి విధులు నిర్వహిస్తున్నారు.

కమిషనర్‌ ఆదేశాలు బుట్టదాఖలు!

ఇదిలా ఉండగా రాష్ట్ర ఎకై ్సజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌బాబు మూడు నెలల క్రితం రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న అడిషనల్‌, జాయింట్‌, డెప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించిన 40 మంది సిబ్బందికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని ఆ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. తద్వారా వారి విధి నిర్వహణ, వసతి, రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఏకంగా కమిషనర్‌ ఆదేశాలే బుట్టదాఖలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆదేశాల అమలును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నెలలో 15 రోజుల పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉంటూ పడరాని పాట్లు పడుతున్నా అధికారులు కనీసంగా కూడా స్పందించడం లేదని ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వాపోతున్నారు. వసతి సంగతి దేవుడెరుగు.. కనీసం డ్యూటీ అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతే కాకుండా, ఈ రెండు జిల్లాల్లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు అజమాయిషీ ధోరణితో వ్యవహరిస్తూ తమకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ డ్యూటీ ప్రయోజనాలేవీ ఇవ్వకపోగా, 15 రోజులు గడిచిన తర్వాత రిలీవ్‌ చేయాల్సి ఉన్నా, ఆ ఊసే లేకుండా బలవంతంగా విధుల్లో కొనసాగిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాము అడుగుతున్నా స్పందించడం లేదని, ఎప్పటికో స్పందించినా తాము చెప్పేంత వరకూ రిలీవ్‌ చెయ్యొద్దంటూ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారని వాపోతున్నారు.

ఆ డబ్బులేమయ్యాయో!

క్షేత్ర స్థాయి సిబ్బందికి నయా పైసా కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్న అధికారులు వారికి నిబంధనల ప్రకారం జరగాల్సిన చెల్లింపులకు చెల్లు చీటీ రాసేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. దీనికోసం వేలం పాటలు నిర్వహించారు. ప్రతి దరఖాస్తుకు రూ.5 లక్షల చొప్పున ఎకై ్సజ్‌ శాఖ నాన్‌ రిఫండబుల్‌ రుసుం వసూలు చేసింది. ఇందులో దరఖాస్తుకు రూ.10 వేల చొప్పున ఆయా జిల్లాల ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారుల ఆధ్వర్యాన ఎకై ్సజ్‌ ఫండ్‌ పోగేశారు. సారా నివారణకు అమలు చేస్తున్న నవోదయ 2.0 కార్యక్రమం కోసం ప్రిన్సిపాల్‌ కమిషనర్‌ చొరవతో ఈ ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటైంది. ఈ నిధులను సారా నివారణకు చేపట్టే ఏ చర్యకై నా వినియోగించవచ్చని ఆదేశిస్తూ, వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర కమిషనర్‌కు అప్పగించారు. అయితే, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ నిధులు ఏమయ్యాయోనన్న ఆ శాఖలో చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నిధులే కనుక ఉండి ఉంటే తమకు డ్యూటీ అడ్వాన్సులే ఇచ్చి ఉండేవారు కదా అనే అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. నిధుల లెక్కలపై ఉన్నతాధికారులు ఆరా తీసి పక్కదారి పడితే చర్యలు తీసుకోవాలని, ఖాతాలోనే ఉంటే తమకు చెల్లింపులు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

ఫ సారా నియంత్రణకు 4 జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది

ఫ డెప్యూటేషన్‌పై డ్యూటీలు వేసిన ప్రభుత్వం

ఫ కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో విధులు

ఫ ఆహారం, నిలువ నీడకు కానరాని ఏర్పాట్లు

ఫ డ్యూటీ అడ్వాన్సులూ లేక ఇక్కట్లు

ఫ 2 నెలలుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement