తేలని పంచాయితీ
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుపై అధికార కూటమిలో నడుస్తున్న ‘పంచాయితీ’ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కాలపరిమితి గత ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసింది. అంటే, పాత ట్రస్ట్ బోర్డు రద్దై 10 నెలలవుతోంది. ఇప్పటికీ కొత్త ట్రస్ట్ బోర్డు నియామకంపై కూటమిలోని మూడు పార్టీల మధ్య పంచాయితీ ఓ కొలిక్కి రావడం లేదు. ట్రస్ట్ బోర్డుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ చైర్మన్‌గా ఉంటారు. ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులను నియమించాల్సి ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తమ నుంచి ఇద్దరేసి చొప్పున సభ్యులను నియమించాలని బీజేపీ, జనసేన కోరుతున్నాయి. టీడీపీ మాత్రం ఆ రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని, మిగిలిన 15 మందీ తమవారే ఉండాలని పట్టుబడుతోంది. ఈ వివాదం తేలకపోవడంతో ట్రస్ట్ బోర్డు నియామకం వాయిదా పడుతోంది. దీంతో, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ మాత్రమే ట్రస్ట్ బోర్డు తరఫున దేవస్థానం ఈఓతో సమావేశమై తీర్మానాలు చేస్తున్నారు.
ఈ నియోజకవర్గాల నుంచేనా!
ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికగా టీడీపీ నుంచి 13 నుంచి 15 మందిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ పెద్దాపురం నుంచి దాత, శ్రీ లలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్‌ను రెండోసారి కూడా దాత కోటాలో సిఫారసు చేసినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనను ట్రస్ట్‌బోర్డు సభ్యునిగా నియమించారు. సత్యప్రసాద్ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు రూ.2.5 కోట్ల వ్యయంతో వజ్ర కిరీటాలు చేయించారు. అలాగే, రూ.5 కోట్లతో సత్యదేవుని ప్రసాద తయారీ భవనం, మరో రూ.2 కోట్ల విలువైన పూజా సామగ్రి సమర్చించడంతో పాటు పలు భవనాలు నిర్మించారు.
ఫ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, పాయకరావుపేట ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి ట్రస్ట్ బోర్డులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఫ కోనసీమ నుంచి ఒకరు, మిగిలిన ఇద్దరు గుంటూరు, విశాఖకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఫ నాయీ బ్రాహ్మణ వర్గాల నుంచి ఒకరిని నియమించనున్నారు. అలాగే, ప్రధానార్చకుడిని కూడా నియమిస్తారని చెబుతున్నారు.
ఫ జగ్గంపేట నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక హోటల్ యజమానిని అక్కడి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించినట్లు సమాచారం.
ఫ తుని నుంచి నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీప బంధువుకు ట్రస్ట్ బోర్డులో స్థానం దక్కింది. ఈసారి కూడా ఆయన ఆశించినా ఫలితం దక్కలేదని సమాచారం.
ఫ ప్రత్తిపాడు నుంచి ఒక బీసీ మహిళ, మరో ఓసీకి అవకాశమివ్వాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి బీజేపీకి అవకాశం ఇస్తే ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కనుంది.
ఫ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని నియమించాలని కోరుతున్నారు. అయితే, జనసేన తరఫున ప్రతిపాదించిన పిఠాపురం మండలానికి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో టీడీపీ నాయకుల మీద, జనసేనలోని ఒక వర్గం నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కొంతమంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్క్రీన్ షాట్లు తీసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని ఆ నియోజకవర్గ ఫైవ్ మెన్ కమిటీకి పవన్ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై పునరాలోచనలో పడినట్టు సమాచారం.
ఫ అలాగే, రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున కూడా ఒక్కొక్కరిని నియమించాలని పట్టు పడుతున్నారు.
ఫ కోనసీమ నుంచి ఎస్సీ లేదా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు సమాచారం.
ఫ ఇదిలా ఉండగా ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు నియామకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పుడు మూఢం కావడంతో ఫిబ్రవరి లేదా మార్చిలో దీనిపై ఆలోచిద్దామని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఫ అన్నవరం ట్రస్ట్ బోర్డుపై కూటమిలో కుదరని ఏకాభిప్రాయం
ఫ ఎక్కువ మంది తమవారే ఉండాలని టీడీపీ పట్టు
ఫ పాత ధర్మకర్తల మండలి
రద్దై 10 నెలలు
ఫ ఇప్పటికీ ఏర్పాటు కాని
నూతన మండలి
ఏకాభిప్రాయం కుదరక..
ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని టీడీపీ అధిష్టానం గత జూలైలోనే ఆదేశించింది. దీంతో మంత్రులు, ఆయా ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లను అధిష్టానానికి అందజేశారు. వీరిలో ఎవరిని తొలగించాలి, ఎవరిని ఉంచాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీనికి తోడు బీజేపీ, జనసేనల నుంచి ఎంత మందిని నియమించాలనే దానిపై కూడా మూడు పార్టీల సఖ్యత కుదరడం లేదని సమాచారం.
కొత్త ట్రస్ట్ బోర్డులో 18 మంది
కొత్త ట్రస్ట్ బోర్డులో చైర్మన్ సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయ శాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా 17 మందిని నియమిస్తారు. వీరిలో సుమారు 12 లేదా 13 మంది పురుషులు, నలుగురైదుగురు మహిళలు ఉంటారని తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కూడా స్థానం కల్పించాల్సి ఉంది. అలాగే, దేవస్థానం తరఫున ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో సామాజిక సమతుల్యం పాటించారు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారు. వ్యవస్థాపక ధర్మకర్తతో కలిపి మొత్తం 16 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత చంద్రబాబు ప్రభుత్వంపై పడింది. ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు.


