హంతకులను అరెస్టు చేయాలి
కిర్లంపూడి: మండలంలోని భూపాలపట్నంలో దళిత నాయకుడు కాకర అప్పారావు హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని దళిత బహుజన, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, డీబీఫ్ జాతీయ కో ఆర్డినేటర్ తోటి చెంగలరావు ఆధ్వర్యాన దళిత సంఘాల నాయకులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళిత నాయకుడైన హతుడు అప్పారావు భూపాలపట్నంలో దళితులను చైతన్యపరచడంతో పాటు దళిత సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన ఓ వ్యక్తి తన అధికారానికి అడ్డు వస్తున్నాడని భావించి గ్రామం వదిలి వెళ్లిపోవాలంటూ అప్పారావును అనేకసార్లు హెచ్చరించారని అన్నారు. దీనిని ఖాతరు చేయకపోవడంతో అప్పారావును తన కారు డ్రైవర్‌తో హతమార్చేందుకు ఆ వ్యక్తి పథకం రచించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ కారు డ్రైవర్, అతడి సోదరుడు, మరి కొంత మంది కలిసి అప్పారావును ఇనుప రాడ్లతో కొట్టి చంపారని అన్నారు. హత్యకు కారకుడైన ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, అప్పారావుకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు తెలిపినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్థానిక పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ప్రాసిక్యూట్ చేయాలని, ఎఫ్‌ఐఆర్‌లో అవకతవకలను సవరించాలని దళిత నేతలు డిమాండ్ చేశారు.
కఠినంగా శిక్షించాలి
వైఎస్సార్ సీపీ కార్యకర్త కాకర అప్పారావును హతమార్చిన వారు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం డిమాండ్ చేశారు. అప్పారావు హత్య విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అప్పారావు హంతకులను పట్టుకుని శిక్షించాలని, పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఫ పథకం ప్రకారమే కాకర అప్పారావు హత్య
ఫ దళిత నేతల డిమాండ్
ఫ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా
హంతకులను అరెస్టు చేయాలి


