ఎరియర్లు చెల్లించాలి
కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న 120 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెంటనే ఎరియర్లు చెల్లించాలని అధ్యాపకుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022లో విడుదల చేసిన జీఓ 110 ప్రకారం పీజీ, పీహెచ్‌డీ అర్హతలున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు రూ.35 వేలు, సెట్, నెట్ అర్హత ఉన్న వారికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. జీతభత్యాల చెల్లింపులో జాప్యం చేస్తూ తమను వర్సిటీ అధికారులు మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి 2022 నుంచి రావలసిన ఎరియర్ల చెల్లింపునకు ప్రొసీడింగ్స్ జారీ చేశారని, అధ్యాపకుల విషయంలో మాత్రం కాలయాపన చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేస్తానని వీసీ పలుమార్లు హామీ ఇచ్చారే తప్ప నేటికీ స్పష్టత లేదని అన్నారు. వృత్తి కోర్సులు అభ్యసించే అధ్యాపకులకు ఎటువంటి ఇన్సెంటివ్‌లూ ఇవ్వకపోగా, రావలసిన ఎరియర్లు కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
యాప్‌లతో ఉపాధ్యాయులు
బోధనకు దూరం
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్
అయినవిల్లి: బోధనేతర పనులు, యాప్‌లతో ఉపాధ్యాయులను ప్రభుత్వం బోధనకు దూరం చేస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ముక్తేశ్వరంలోని వైవీఎస్ అండ్ బీఆర్‌ఎం కళాశాల ప్రాంగణంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం పోతంశెట్టి దొరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చి, ఇప్పుడు అమలుకు తాత్కారం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా చేశారని, కొన్నిచోట్ల బదిలీలు చేసి రిలీవ్ చేయలేదని అన్నారు. డీఏ బకాయిలు చెల్లించలేదని, పదోన్నతులు ప్రకటించలేదన్నారు. పీఆర్సీ కమిటీ తక్షణమే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి సర్వీసులో ఉన్న ఉపాధాయులకు సడలింపు ఇవ్వాలని కోరారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ నల్లి ప్రసాద్, బోనం వెంకట గంగాధర్, కేవీఎస్ ఆచారి, మట్టా నాగరాజు, ఉమ్మడి జిల్లా ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు కేవీ శేఖర్, ఉద్యమ నాయకులు కేకేవీ నాయుడు, ఎస్‌వీ నాయుడు, నేరేడిమిల్లి సత్యనారాయణ, పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రూ.లక్ష విరాళం
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి నిత్యాన్నప్రసాద పథకానికి గూడూరు వీర వెంకట గోవర్ధన్, భారతి దంపతులు (భీమవరం మండలం గునుపూడి) రూ.1,00,116 విరాళం సమర్పించారు.
అసోసియేషన్ ఎన్నికలు
కొత్తపేట: ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీఓ) జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 18న నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కొత్తపేట తాలూకా ఎన్జీఓ నాయకులు ఆదివారం తెలిపారు. ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా ఆ జిల్లా కార్యదర్శి పి.రమేష్, పరిశీలకురాలిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి డి.జానకిని నియమించారు. ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లు, ఒక ఉమెన్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, ఉమెన్ జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్‌తో మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, ఈ నెల 11న నామినేషన్లు వేయడం, పరిశీలన, ఆమోదం, ఉపసంహరణ, నామినేషన్ల తుది జాబితా విడుదల ఉంటుంది. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, రెండు గంటల నుంచి కౌంటింగ్, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. అమలాపురం పంచాయతీరాజ్ కాటన్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్జీఓ నాయకులు తెలిపారు.
ఎరియర్లు చెల్లించాలి


