
ఆరోగ్యశ్రీ..కూటమి ఉరి!
● జిల్లాలో 32 ఎన్టీఆర్ వైద్య సేవ
నెట్‌వర్క్ ఆస్పత్రులు
● రూ.110 కోట్లకు పైగా
బకాయి పెట్టిన సర్కారు
● వెంటనే చెల్లించాలని ఆస్పత్రుల డిమాండ్
● స్పందించని ప్రభుత్వం
● నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు
● నిలిచిపోయిన సర్జరీలు 90 పైనే
● నిరాశతో తిరుగుముఖం పట్టిన రోగులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేదల ప్రాణ సంజీవని.. ఆరోగ్యశ్రీకి కూటమి సర్కారు ఉరి బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా పేదలకు అధునాతన, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలపై సర్కారు పిడుగు పడేసింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను కూట మి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని దాదాపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేశాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల కోసం ప్రతి రోజూ నెట్‌వర్క్ ఆస్పత్రులకు వెయ్యికి తక్కువ కాకుండా ఔట్ పేషెంట్లు (ఓపీ) వస్తారని అంచనా. ఒక్కో నెట్‌వర్క్ ఆస్పత్రిలో రోజుకు మూడు నాలుగు సర్జరీలు జరుగుతూంటాయని చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 32 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ సమ్మె తొలి రోజైన శుక్రవారం 90కి పైగా సర్జరీలు నిలిచిపోయాయి. వీటిలో అత్యవసర శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆయా ఆస్పత్రుల వద్ద ఉచిత వైద్య సేవలను నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశతో ఇంటిముఖం పట్టారు. పేదల మనసు తెలిసిన డాక్టర్‌గా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీయే. ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత పరిపుష్టం చేశారు. రూ.లక్షలు ఖర్చయ్యే ఖరీదైన వైద్యాన్ని కూడా చిల్లిగవ్వ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకం ద్వారా అందించి, సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసేవారు. నిరుపేదల సంజీవనిగా నిలిచిన ఈ పథకం పేరు మార్చేసిన కూటమి సర్కారు.. ఇప్పుడు దీనికి ఏకంగా ఉరి బిగించే దిశగా అడుగులు వేస్తోంది.
పదేపదే విన్నవించినా..
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయి ఏడాది పైనే అవుతోంది. అప్పటి నుంచీ వీటి చెల్లింపులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగానే రూ.110 కోట్లు పైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. గుండె, గుండె సంబంధిత, గొంతు, చెవి, గ్యాస్ట్రో, సర్జరీ, మూత్రపిండ తదితర శస్త్రచికిత్సలకు రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయి. ఇవి గుదిబండగా మారి, ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా తయారవడంతో ఈ నేపథ్యంలో ఆరేడు నెలలుగా నెట్‌వర్క్ ఆస్పత్రులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి. బకాయిల విడుదలపై సానుకూలంగా స్పందించకుంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఇప్పటికే రెండు పర్యాయాలు విన్నవించాయి. గత ఏప్రిల్ నెలలో ఒకసారి సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి సమ్మె విరమించారు. తీరా చూస్తే చంద్రబాబు ఆ హామీని కూడా షరా మామూలుగానే గాలిలో కలిపేశారని నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మండిపడుతున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఎన్టీ ఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. ఈ మేరకు కాకినాడ నగరంలోని దాదాపు అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల వద్ద సేవలు బంద్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో, ప్రభుత్వ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలకు పూర్తిగా బ్రేక్ పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ఖరీదైన వైద్యం అందుకోలేక నానా అగచాట్లూ పడుతున్నారు.