
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నిబంధనలు పాటించని బాణసంచా తయారీ, విక్రయాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. అగ్నిమాపక అధికారులు, తహసీల్దార్లు, బాణసంచా తయారీదార్లతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటం నేపథ్యంలో తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీపావళి పండగ సందర్భంలో జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ, విక్రయదారులు నిబంధనలు నూరు శాతం అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని అనుమతులూ ఉన్నా ప్రమాదం జరిగితే బాణసంచా తయారీదారుపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. జిల్లాలో 29 బాణసంచా తయారీ కేంద్రాలు, 11 స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో పని చేసే కార్మికులకు తప్పనిసరిగా ప్రమాద బీమా చేయించాలన్నారు. ఉల్లి బాంబుల తయారీ, అమ్మకాన్ని నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నూరు శాతం ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని అన్నారు.
అన్నవరం దేవస్థానానికి
రూ.30 లక్షల బస్సు
అన్నవరం: సత్యదేవుని దేవస్థానానికి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.30 లక్షల విలువైన 32 సీట్లు కలిగిన బస్సును సమకూర్చింది. ఈ బస్సు తాళాలను ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందజేశారు. గతంలో కూడా ఎస్‌బీఐ రెండు బ్యాటరీ కార్లు, ఒక బస్సును దేవస్థానానికి అందజేసింది. కార్యక్ర మంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం రాజేష్‌కుమార్ పటేల్, జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, డీజీఎం పంకజ్ కుమార్ (రాజమహేంద్రవరం), సర్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల ముందే
సిఫారసు లేఖలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని సత్రాల్లో వసతి గదులు, దర్శనం, వ్రతాల కోసం ఐదు రోజుల ముందే సిఫారసు లేఖలు పంపించాల్సి ఉంటుంది. ఇకపై వాట్సాప్, ఫోన్ మెసేజ్‌లు అంగీకరించబోమని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఫారసు లేఖలను కూడా పరిశీలించిన అనంతరం, అవి వాస్తవమని నిర్ధారించుకున్నాక మాత్రమే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అవిశ్వాస తీర్మానంపై
తిరిగి సమావేశం
సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్
ఉదంతంలో హైకోర్టు తీర్పు
సామర్లకోట: మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తిరిగి సమావేశం నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. వివరాలివీ.. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు 22 మంది సొంత పార్టీ సభ్యులు ఏప్రిల్ 2న సంతకాలు చేసి లేఖ ఇచ్చారు. ఈ మేరకు మే 15న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ సమావేశానికి కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే, ఆ సమావేశానికి ముందే చైర్‌పర్సన్ కోర్టును ఆశ్రయించారు. మే 15న జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 25 మంది సభ్యులు ఓట్లు వేశారు. దాంతో, ఆ తీర్మానం నెగ్గింది. అయినప్పటికీ, కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా ప్రత్యేకాధికారి ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానంపై మరోసారి సమావేశం నిర్వహించాల్సిందిగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన రెడ్నం సునీత విలేకరులకు తెలిపారు.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు