
వైద్య కళాశాలలు ప్రజల ఆస్తి
● వాటి నిర్వీర్యానికి కూటమి కుట్రలు
● ప్రజా చైతన్యంతో చలో
నర్సీపట్నం విజయవంతం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
తుని రూరల్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడి తీసుకువచ్చిన 17 వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యార్థులకు, ప్రజలకు మేలు చేసేందుకు ఒక్కో వైద్య కళాశాలలకు 50 ఎకరాల చొప్పున భూ సేకరణ జరిపిందని చెప్పారు. ఈ కళాశాలలు పూర్తయితే 630 పడకల ప్రభుత్వాస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలల్లో రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారని, తరగతుల నిర్వహణకు మరో రెండు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పది కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా.. వీటిని తన తాబేదార్లకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో కంకణం కట్టుకుందన్నారు. 17 వైద్య కళాశాలల్లో వైద్య విద్యతో పాటు కోట్లాది మందికి వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అటువంటి మహత్తరమైన వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సీట్లు కావాలనుకుంటారని అన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కేజీహెచ్ ఉందన్నారు. గీతం, నారాయణ వంటి ప్రైవేట్ కాలేజీలున్నప్పటికీ ఆంధ్రా, రంగరాయ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసమే విద్యార్థులు పోటీ పడతారని చెప్పారు.
అందుకే జగన్ పర్యటన
స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ లేదని, జీఓ లేదని అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని, ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పర్యటించి, కాలేజీ నిర్మాణాలను చూపించారని రాజా అన్నారు. అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని మరీ లక్షలాదిగా వచ్చిన ప్రజలు జగన్‌తో పాటు కాలేజీ నిర్మాణాలను కళ్లారా చూశారని చెప్పారు. తిమ్మిని బమ్మి చేసేందుకు చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు ఆరాటపడుతున్నాయని దుయ్యబట్టారు. వైద్య సేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సాక్షాత్తూ రాజోలు ఎమ్మెల్యేనే అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
రక్షిత నీరు అందించని సర్కారు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడుతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకూ ఆర్వో వాటర్ అందిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని అటకెక్కిస్తోందని రాజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఈ ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. ఫలితంగానే కలుషిత నీరు తాగి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. గుంటూరులోనూ ఇదే పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షిత నీరు అందించలేని ప్రభుత్వం కర్ణాటకకు తాగునీరు అందిస్తామనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలతో రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల్లా అధికారులు కూడా మాజీ సీఎం జగన్‌ను ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని, భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని సెల్యూట్ చేస్తారని ప్రశ్నించారు. 2029లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. పోలీసులు, అధికార పక్షం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి మరీ ప్రజలు తరలివచ్చి చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేశారని రాజా అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్, పార్టీ తుని రూరల్, పట్టణ, తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు దుంగల నాగేశ్వరరావు, అన్నవరం శ్రీను, బత్తుల వీరబాబు, చింతకాయల చినబాబు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అన్నంరెడ్డి వీరరాఘవులు, ఆత్మ మాజీ చైర్మన్ చోడ్రాజు రాంబాబురాజు, సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు, చింతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.