
నకిలీ మద్యంపై మహిళల పోరు
● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం వద్ద నిరసన
● సమయం ఇచ్చి డుమ్మా కొట్టిన అధికారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నకిలీ మద్యంపై మహిళలు రోడ్డెక్కారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబు సర్కారు చెవికెక్కడం లేదంటూ వైఎస్పార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యాన శుక్రవారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ నాయకత్వంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన పార్టీ మహిళా నేతలు, మహిళలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పైడా వీధిలోని పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా నడుపుతున్నారని, విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నకిలీ మద్యం విక్రయాలతో పేదలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా కేవలం ఆదాయమే పరమావధిగా పని చేస్తున్న కూటమి సర్కార్‌పై మహిళా నేతలు నిప్పులు చెరిగారు. నిరసన అనంతరం ఉదయం 11 గంటలకు ఎకై ్సజ్ డీసీకి వినతిపత్రం అందజేసేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ ఆయన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి కూడా వెళ్లిపోవడమేమిటని మండిపడ్డారు. ఇతర అధికారులకు ఇవ్వాలని ప్రయత్నించినా వారు కూడా లేకపోవడంతో అందుబాటులో ఉన్న మహిళా ఎస్సైకి వినతిపత్రం అందజేశారు.
విచ్చలవిడిగా నకిలీ మద్యం
ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి వంగా గీత మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న నకిలీ మద్యంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ధ్వజమెత్తారు. జిల్లాలో బెల్టు షాపులు లెక్కే లేకుండా ఏర్పాటయ్యాయని, వీటిని దొడ్డిదారిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. మద్యం విక్రయాలు ఎనీ టైమ్ మద్యం (ఏటీఎం) మాదిరిగా తయారయ్యాయని ఆక్షేపించారు. రాష్ట్ర చరిత్రలోనే మద్యం అమ్మకాల్లో మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం యథేచ్ఛగా దొరుకుతూండటంతో పేద కుటుంబాలు గుల్లయిపోతున్నాయని, విచ్చలవిడి మద్యం అమ్మకాలు, కల్తీ మద్యంతో యువత మద్యానికి బానిసైపోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి దీప్తి కుమార్, బెహరా రాజేశ్వరి, అల్లవరపు నాగమల్లేశ్వరి, పి.సరోజ, మాకినీడి శేషుకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ మద్యంపై మహిళల పోరు