
గోదావడి..
కోటిలింగాల ఘాట్ వద్ద వరద గోదారి
తగ్గుతూ.. పెరుగుతూ..
ధవళేశ్వరం: కొద్ది రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. అయితే, ఎగువన నీటిమట్టాలు పెరుగుతూండటంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. అనంతరం క్రమేపీ రాత్రి 8 గంటలకు 12 అడుగులకు తగ్గింది. బ్యారేజీ నుంచి 10,09,208 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక్కడ నీటి ఉధృతి క్రమేపీ తగ్గుతూండగా మరోవైపు ఎగువన భద్రాచలంలో ఆదివారం సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి సోమవారం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టా కాలువలకు 10,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఈ సీజన్‌లో మూడోసారి..
ఈ సీజన్‌లో మూడుసార్లు వరదలు వచ్చాయి. గత నెల 21వ తేదీన ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటిమట్టం చేరింది. ఆ మర్నాడు.. అంటే గత నెల 22న బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ఉధృతి చేరింది. ఆ సమయంలో అత్యధికంగా 14.30 అడుగులకు నీటిమట్టం చేరగా 13,57,119 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రెండోసారి గత నెల 30వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. ఆ సమయంలో నీటిమట్టం 13.10 అడుగులకు చేరుకోగా 11,79,236 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మూడోసారి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరింది. గరిష్టంగా 12.50 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 10,78,317 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.
ఎగువ ప్రాంతాల్లో గోదావరి
నీటిమట్టాలు (మీటర్లలో)
కాళేశ్వరం 11.20
పేరూరు 15.89
దుమ్ముగూడెం 11.84
భద్రాచలం 43.40 (అడుగులు)
కూనవరం 18.46
కుంట 9.75
కొయిదా 24.55
పోలవరం 12.01
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.08
ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గిన ఉధృతి
ఉదయం నీటిమట్టం 12.50 అడుగులు
రాత్రి 12 అడుగులకు తగ్గుదల
ఎగువన పెరుగుతున్న నీటిమట్టాలు
కాటన్ బ్యారేజీ వద్ద వరద
నేడు స్వల్పంగా పెరిగే అవకాశం