
అన్నవరం.. భక్తజనసంద్రం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన అన్నవరం దివ్యక్షేత్రం శనివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. వేలాదిగా వచ్చిన భక్తులకుతోడు వివాహ బృందాల వారు, నవ దంపతులు, వారి బంధువులు తరలి రావడంతో రత్నగిరిపై తెల్లవారుజాము నుంచే తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 60 వేల మంది భక్తులు సత్యదేవుడిని దర్శించుకున్నారు. సత్యదేవుని సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి రెండు గంటల చొప్పున సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 5 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 8 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు.
భక్తులకు ఇబ్బందులు
ఫ ఉదయం నుంచే వివిధ వాహనాల్లో వేలాదిగా భక్తులు వచ్చారు. రత్నగిరిపై పార్కింగ్‌కు చోటు చాలకపోవడంతో ఆ వాహనాలను సత్యగిరికి మళ్లించారు. దీంతో, భక్తులు అక్కడి నుంచి ఆలయానికి నడిచి రావాల్సి వచ్చింది. ఉచిత బస్సు ఉన్నప్పటికీ అందులో 50 మందికి మించి ఎక్కే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు.
ఫ అంతరాలయం టికెట్టు తీసుకున్నప్పటికీ వెలుపల నుంచే సత్యదేవుని దర్శనం కల్పించడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో వృద్ధులు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. పలుమార్లు తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో క్యూ లైన్లను నియంత్రించే వారే లేకుండా పోయారు.
ఫ ప్రత్యేక దర్శనం చేయిస్తామంటూ పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు భక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. వారిని దేవస్థానం ఉద్యోగుల సహాయంతో ఆలయానికి తీసుకువెళ్లారు. దీనిని అడ్డుకునే వారే లేకపోవడంతో ఇతర భక్తులు ఇబ్బంది పడ్డారు.
·˘ సత్యదేవుని దర్శించిన
60 వేల మంది భక్తులు
·˘ రూ.60 లక్షల ఆదాయం

అన్నవరం.. భక్తజనసంద్రం