
నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..
● వాడపల్లి క్షేత్రంలో భక్తజన ప్రవాహం
● ఒక్క రోజులోనే దేవస్థానానికి
రూ.53.41 లక్షల ఆదాయం
కొత్తపేట: గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. శ్రీనివాసా... శ్రీ పురుషోత్తమా.. అంటూ వాడపల్లి వాసుని స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన చేరుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులతో లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను చేరవేశారు. విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి సాయంత్రం 7 గంటల సమయానికి రూ.53,41,146 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.