
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తునికి చెందిన నల్లమిల్లి గోవింద్‌ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. అలాగే, పిఠాపురానికి చెందిన అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డిని పార్టీ రాష్ట్ర ఆర్‌టీఐ వింగ్ కార్యదర్శిగా నియమించారు.
జల్ జీవన్ మిషన్‌పై
రేపటి నుంచి శిక్షణ
సామర్లకోట: జల్‌జీవన్ మిషన్ కార్యక్రమంపై 11 జిల్లాల్లోని ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 402 మందికి ఈ నెల 17 వరకూ బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతి బ్యాచ్‌కు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలందరికి జల భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా జల్ జీవన్ మిషన్ అమలు చేస్తున్న గ్రామాల సందర్శన కూడా ఉంటుందని ప్రసాదరావు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లకు
సహాయం పంపిణీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. జిల్లాలోని 12,966 మంది డ్రైవర్ల ఖాతాల్లో శనివారం రూ.19.44 కోట్లు జమ చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, అర్హులైన వారికి ఈ పథకం అందకపోతే సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి, డబ్బులు జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు.
నేడు పారా స్విమ్మింగ్
క్రీడాకారుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఆదివారం పారా స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల పారా స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.రామస్వామి, సాఖీర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఏలూరులో జరగనున్న 7వ రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ సందర్భంగా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 9 గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్దకు హాజరు కావాలని, వివరాలకు 93901 31777 నంబరులో సంప్రదించాలని సూచించారు.
కేసుల పరిష్కారానికి
కృషి చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వివిధ కోర్టుల్లోని కేసులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకటరావు అన్నారు. పీపీలు, ఏపీపీలతో కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో వివిధ కేసుల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ఎన్ని కేసులు వేశారు.. ఎన్నింటికి తీర్పులు వెలువడ్డాయి.. పెండింగ్ కేసులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లెక్చరర్ పోస్టుకు
దరఖాస్తుల ఆహ్వానం
పిఠాపురం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పద్ధతిలో పని చేయడానికి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కావాలని ప్రిన్సిపాల్ పి.సుభాషిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.