
కడుపుకొట్టి.. బుజ్జగింపులా..?
సాక్షి, అమలాపురం/పి.గన్నవరం: ఓవైపు ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టారనే ఆగ్రహం.. దీనికి తోడు ఇస్తానన్న రూ.15 వేల సాయానికి నిబంధనల కొర్రీలు.. ఇలా గిల్లి జోల పాడినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. టీడీపీ శనివారం నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రసాభాసగా మారింది. ‘గోరంత సాయానికి.. కొండంత హడావుడి’ అనే తీరులో ప్రచారార్భాటం చేయాలనుకున్న నేతల వ్యూహం బెడిసికొట్టింది. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఎదురు తిరిగారు. కూటమి సర్కారు తీరుపై అసంతృప్తితో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆటో డ్రైవర్ల సేవలో ర్యాలీకి వంద ఆటోలు కూడా రాలేదు. వచ్చిన వారిలోనూ చాలా మంది కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఇతర టీడీపీ నేతలు వచ్చిన సమయంలో కొంతమంది చోటామోటా నాయకులు ఆటోల ముందు టీడీపీ జెండాలతో ఫొటోలు దిగేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆటో డ్రైవర్లు అభ్యంతరం చెప్పడంతో తమ్ముళ్లు కంగుతిన్నారు.
టీడీపీ, జనసేన బాహాబాహీ
నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు, పరుష పదజాలతో తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కోసం రవాణా శాఖ తయారు చేసిన ఫ్లెక్సీపై, ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసే నమూనా చెక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన నేతలు విరుచుకుపడ్డారు. జనసేనకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తాము నిర్వహించే కార్యక్రమాల్లో చంద్రబాబు ఫొటో వేస్తున్నామని, టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఫొటో వేయ డం లేదని ప్రశ్నించారు. అధికారులు సర్ది చెబుతున్న సమయంలో టీడీపీకి చెందిన మద్దాల సుబ్రహ్మణేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఇతర టీడీపీ నాయకుల పైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు.
ఫ బెడిసికొట్టిన ‘ఆటో డ్రైవర్ సేవలో..’
ఫ ఉచిత బస్సు నేపథ్యంలో
మొక్కుబడిగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు
ఫ పసుపు జెండాలతో
ఫొటోలకు అంగీకరించని వైనం