
ఆయనొస్తేనే చేపల వేట
కొత్తపల్లి: తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల వలన సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించకపోవడంతో మండలంలోని మత్స్యకారులు ఇటీవల కుటుంబ సమేతంగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి, తమకు న్యాయం చేయాలని ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి త్వరలోనే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని అప్పట్లో జిల్లా కలెక్టర్ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఆందోళన చేపట్టినప్పటి నుంచీ ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటకు చెందిన మత్స్యకారులు పవన్ వచ్చి హామీ ఇచ్చేంత వరకూ వేటకు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రామన్నపాలెం, కోనపాపపేట తీర ప్రాంతంలో బోట్లకు లంగరు వేశారు. మరోవైపు రొయ్యల శుద్ధి పరిశ్రమలకు వెళ్లే మత్స్యకార మహిళలు కూలి పనులు కూడా మానుకున్నారు. ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటలో చేపలను విక్రయించే అంగళ్లు సైతం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. తమ సూచనలు పాటించకుండా వేటకు వెళ్లే వారికి జరిమానా విధిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. తమ ఓట్లు వేయించుకుని గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్ తక్షణం ఉప్పాడ వచ్చి, మత్స్యకారులతో సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరించేంత వరకూ వేటకు వెళ్లబోమని మత్స్యకారులు చెబుతున్నారు. న్యాయం చేయకపోతే ఈ నెల 13 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార గ్రామాల్లో నాయకులు సమావేశమై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకుంటున్నారు.
ఫ పవన్ రావాల్సిందే..
ఫ మా సమస్యలు పరిష్కరించాల్సిందే..
ఫ మత్స్యకారుల స్పష్టీకరణ
ఫ ఉప్పుటేరులో నిలిచిపోయిన బోట్లు
ఫ 13 నుంచి ఉద్యమం
ఉధృతం చేసేందుకు అడుగులు

ఆయనొస్తేనే చేపల వేట