
కిటకిటలాడిన లోవ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చిన 10 వేల మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,77,700, పూజా టికెట్లకు రూ.1,15,860, తలనీలాలకు రూ.11,200, వా హన పూజలకు రూ.5,340, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.55,412, విరాళాలు రూ.77,780 కలిపి మొత్తం రూ.4,43,292 ఆదాయం సమకూరిందని వివరించారు.
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయంలోకి ఆదివారం 1,616 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.46 మీటర్లు కాగా, ప్రస్తుతం 84.37 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గానూ నీటి నిల్వలు 19.81 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 900, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు.
నేడు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ ఏడాది మన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 52 అవార్డులు ప్రకటించిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ గోదావరి క్షేత్రంలో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అవార్డులు పొందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

కిటకిటలాడిన లోవ