
రైతుకు విపత్తి
ఎప్పుడూ ఇంత దారుణంగా నష్టపోలేదు
పదేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్లాటినం రకం విత్తనాలు ఒక ఎకరం, మరో రకం విత్తనాలు మరో ఎకరంలో సాగు చేశాను. ప్లాటినం రకం విత్తనాలు వేసిన చేలో మొక్క లు చనిపోతున్నాయి. మొక్క ఎర్రబారి ఎండిపోతోంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు తప్ప ఏ సమాధానమూ చెప్పలేదు. మాకు విత్తనాలు అమ్మిన దుకాణదారు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది.
– ధూళిపూడి వెంకటరావు, రైతు, చేబ్రోలు
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రైతులు కష్టాలకు గురవుతూనే ఉన్నారు. చిన్న విషయానికి కూడా జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి హడావుడి చేసే ఈ నియోజకవర్గంలో ఏడాదిన్నర నుంచి రైతులు అనేక సందర్భాల్లో ఆందోళన బాట పడుతున్న పరిస్థితులే నెలకొంటున్నాయి. గతంలో ధాన్యం కొనుగోళ్లు, వరద నష్టం పంపిణీ.. కొద్ది రోజుల కిందట యూరియా అందక అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఈ కోవలోనే తాజాగా నకిలీ విత్తనాలపై పత్తి రైతులు రోడ్డెక్కారు.
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పత్తి సాగు అధికంగా జరుగుతూంటుంది. ముఖ్యంగా గొల్లప్రోలు మండల రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇక్కడి రైతులు వేదా కంపెనీ ఉత్పత్తి చేసిన ప్లాటినం రకం విత్తనాలు కొనుగోలు చేశారు. పంట వేసి రెండు నెలలు గడిచింది. అయినప్పటికీ దిగుబడి రాకపోగా, మొక్కలు వాటంతట అవే ఎండిపోవడం ప్రారంభమైంది. ఎందుకిలా జరుగుతోందో వారికి అర్థం కాలేదు. రకరకాల పురుగు మందులు వాడి చూశారు. అయినా ప్రయోజనం లేదు. విత్తనాలు కొన్న దుకాణదారుకు ఈ సమస్య చెప్తే ఎగతాళిగా మాట్లాడారు. సమస్యను విత్తన కంపెనీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో దాని ప్రతినిధులు వచ్చి పంటను చూసి వెళ్లారు. ఆ తరువాత ఎటువంటి స్పందనా లేదు. తమకు జరిగిన నష్టంపై దుకాణదారు, కంపెనీ ప్రతినిధులు కనీసం ఎటువంటి సమాధానం చెప్పకపోవడంపై మండిపడిన రైతులు చేబ్రోలులోని విత్తనాల షాపు ముందు శనివారం రాత్రి ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో ప్లాటినం రకం పత్తి విత్తనాలను రైతులు వేసినట్లు సమాచారం. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి, దుర్గాడ, తాటిపర్తి తదితర ప్రాంతాల్లోనే సుమారు 2 వేల ఎకరాల్లో ఈ రకం విత్తనాలు సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఒక చేబ్రోలులోనే 400 ఎకరాల్లో ఈ విత్తనం వేశారు. ఎకరానికి సుమారు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. మొత్తం చేనంతా నాశనమైందని రైతులు వాపోతున్నారు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన పంట మాత్రమే దెబ్బ తినడంతో ఆ విత్తనాలు నాసిరకం లేదా నకిలీవి అయి ఉంటాయని ఆరోపిస్తున్నారు.
ఎకరానికి
రూ.80 వేల నష్టం
కంపెనీ ప్రతినిధితో రైతులు ఫోనులో మాట్లాడితే.. ‘కావలిస్తే సైంటిస్టుల్ని తెచ్చుకోండి.. మీకు నచ్చింది చేసుకోండి’ అని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా డీలర్లు, దుకాణం యజమానులు రెండు నెలలుగా పట్టించుకోలేదు. దీంతో, ఆందోళనకు దిగాల్సి వచ్చింది. రెండెకరాల్లో సాగు చేసేందుకు ప్లాటినం రకం పత్తి విత్తనాలను చేబ్రోలు సాయికృష్ణ ఏజెన్సీస్‌లో కొన్నాను. కాయలు కాసే దశలో పత్తి మొక్కలు ఎక్కడికక్కడే చనిపోవడం మొదలైంది. ఎక్కడైనా పత్తికాయ పగిలితే నల్లబారిపోతోంది. కాయ రాలిపోతోంది. మొక్క గిడసబారి గుడ్డి పత్తిలా పగులుతోంది. చివరకు మొక్క చనిపోతోంది. గత సంవత్సరం ఎకరం పత్తి సాగు చేస్తే రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ లాభం వచ్చింది. ఇప్పుడు మేం పెట్టిన పెట్టుబడి రూ.80 వేలు వచ్చే పరిస్థితి లేదు. తీవ్ర నష్టాల పాలయ్యాం. విత్తనాలమ్మిన దుకాణదారు తనకు సంబంధం లేదని చెబుతున్నారు.
– ఓరుగంటి సూర్యచంద్రశేఖర్,
పత్తి రైతు, చేబ్రోలు
పెట్టుబడి కూడా
వచ్చే పరిస్థితి లేదు
రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. సుమారు రూ.2 లక్షలు పైగా పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకూ కేజీ పత్తి కూడా చేతికి రాలేదు. చెట్లన్నీ చనిపోతున్నాయి. కాయ పగలడం లేదు. విత్తనం గురించి దుకాణదారుకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన వారి పంటే పూర్తిగా దెబ్బ తింది. మిగిలిన రకాలు వేసిన వారి పంటలు బాగానే ఉన్నాయి. అందువల్లనే విత్తనాల్లో తేడా ఉందని చెబుతున్నాం. దీనిపై అధికారులు విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుని, రైతులను ఆదుకోవాలి.
– ధూళిపూడి గనికిరాజు,
రైతు, చేబ్రోలు
సరిగ్గా పండకుండానే
ఎండిపోయిన పత్తి మొక్క
ఫ పవన్ ఇలాకాలో రైతుకు మరో విపత్తు
ఫ నిండా ముంచేసిన నకిలీ పత్తి విత్తనాలు
ఫ 2 వేల ఎకరాల్లో పంట నష్టం
ఫ రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు
ఫ పట్టించుకోని విత్తన కంపెనీ, అధికారులు
చర్యలు తీసుకుంటాం
ప్లాటినం రకం విత్తనాలు దెబ్బ తీసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మాకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటాం. అవసమైతే శాస్త్రవేత్తలను రప్పించి, పంట నష్టం ఎందువల్ల జరిగిందనే దానిపై పరిశీలన చేయిస్తాం. విత్తనాల వల్లే ఇలా జరిగిందా లేక ఏదైనా తెగులు సోకిందా అనే అంశాలను కూడా పూర్తిగా పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది.
– సత్యనారాయణ, వ్యవసాయ అధికారి, గొల్లప్రోలు

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి