
షట్టర్ వంచి.. ఆపై అద్దాన్ని పగులగొట్టి..
● నగల దుకాణంలో 11 కిలోల వెండి చోరీ
● ఆభరణాల విలువ రూ.2 లక్షలు
ప్రత్తిపాడు రూరల్: దుకాణం షట్టర్‌ను పైకి వంచి.. దానిని ఆనుకుని ఉన్న అద్దాలను పగులగొట్టిన దొంగలు నగల దుకాణాన్ని కొల్లగొట్టిన ఉదంతమిది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక అల్లూరి సీతారామరాజు జంక్షన్ సమీపంలో సురేష్ జ్యూయలర్స్ అండ్ బ్యాంకర్స్‌లో మంగళవారం అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు దొంగలు దుకాణం వద్దకు చేరుకుని, షట్టర్ కింది భాగాన్ని ఇనుప రాడ్లతో పైకి వంచి, షట్టర్‌కు ఆనుకుని ఉన్న అద్దాలను పగలుగొట్టారు. దాని ద్వారా లోనికి ప్రవేశించిన నలుగురు దుకాణంలో ఉన్న రూ.2 లక్షలు విలువైన 11 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించారు. దుకాణంలోని లాకర్‌ను తెరిచేందుకు వారు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంలో చేతికందిన వెండి ఆభరణాలను తస్కరించారు. లాకర్‌లో బంగారు వస్తువులు ఉన్నాయి. ఆయా ఘటనల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సైలు ఎస్ లక్ష్మీకాంతం, శ్రీహరిరాజు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఫారెస్టు చెక్ పోస్ట్ వైపు కాలినడకన వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టు తెలిసింది. గ్రామంలోని దుర్గమ్మ గుడి వీధిలో మోటార్ బైక్ మంగళవారం రాత్రి చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు గుడివాడ వెంకటసత్య రవి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.