
వచ్చేనెల పదో తేదీలోపు పరిష్కారం!
● హామీ ఇచ్చిన కలెక్టర్, నేతలు
● ఆందోళన విరమించిన మత్స్యకారులు
కొత్తపల్లి: కాలుష్యాన్ని వదిలే పరిశ్రమల నిర్మాణంతో సముద్ర జలాలు పాడై జీవనోపాధి కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని అమీనాబాద్ మత్స్యకారులు చేపట్టిన ఆందోళనను బుధవారం విరమించారు. ముందుగా కలెక్టర్ షణ్మోహన్ మత్స్యకారుల వద్దకు వచ్చి ఆందోళన విరమించి వేటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర జలాలు కలుషితమై చేపలు పడడం లేదంటుంటే వేటకు ఎలా వెళ్లమంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. దీంతో జిల్లా అడిషనల్ ఎస్పీ మణిదేవ్ రాజ్, సీఐ శ్రీనివాసులు అక్కడి నుంచి కలెక్టర్‌ను కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇంతలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మత్స్యకార నాయకులతో ఫోన్‌లో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్టోబర్ పదో తేదీలోపు ఈ సమస్యలపై సమావేశమవుతానని హామీ ఇచ్చారని వివరించారు. దీంతో వారంతా కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ సైతం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఒకవేళ పవన్ కల్యాణ్ సమావేశం కాకుంటే అక్టోబర్ 13వ తేదీ నుంచి ఆందోళన చేస్తామని మత్స్యకార నాయకులు ఉమ్మడి జాన్, నక్కా మణికంఠ, సూరాడ రాజు, ఉమ్మడి జగన్నాథం తదితరులు తెలిపారు.