
ఆర్టీసీ బస్సు ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి
పెరవలి: గోతుల రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మోటార్ సైకిలిస్టును ఢీకొట్టి అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న రేకుల షెడ్డును ఆ తరువాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిలిస్ట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిడదవోలు–నరసాపురం ఆర్‌అండ్‌బీ రోడ్డులో తీపర్రు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు వీరంగం సృష్టించింది. తణుకు నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఆర్‌టీసీ బస్సు తీపర్రు వద్ద రోడ్డుపై ఉన్న గోతుల్లో పడి బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో మండలంలోని కడింపాడు గ్రామానికి చెందిన సలాది సత్యనారాయణ (50) మోటార్ సైకిల్‌పై తీపర్రు నుంచి పెరవలి వస్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టటంతో అతను మోటార్ సైకిల్ పై నుంచి ఎగిరి రోడ్డ పక్కన ఉన్న ఇంటి అరుగుపై పడ్డాడు. బస్సు ఢీకొన్న వేగానికి సత్యనారాయణ తలకు బలమైన గాయం అయింది. తణుకులోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. బస్సు వేగంగా ఢీకొట్టడంతో రేకుల షెడ్డు, విద్యుత్ స్తంభం నేలకొరిగాయి. ఈ బస్సు ప్రమాదం రోడ్డుకి రెండవ వైపున జరిగి ఉంటే బస్సు నేరుగా కాలువలోకి వెళ్లిపోయేదని, ఆ సమయంలో బస్సులో ఉన్న 60 మందికి ప్రమాదం సంభవించేదని స్థానికులు అంటున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పెరవలి ఎస్సై యం వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు సత్యనారాయణకి భార్య సత్యరాధ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి