
అంతర్జాతీయ లఘుచిత్ర పోటీల్లో తృతీయ బహుమతి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ లఘుచిత్ర పోటీల్లో కాకినాడకు చెందిన యూట్యూబర్, సినీ నటుడు సూర్య ఆకొండి దర్శకత్వం వహించి, నటించిన ‘తెలుగు వైభవం’ లఘుచిత్రం తృతీయ స్థానంతో పాటు రూ.50 వేల నగదు బహుమతి గెలుచుకొంది. ఎడిటింగ్ విభాగంలో కూడా ఆయన వ్యక్తిగత బహుమతి సాధించారు. దర్శక, నిర్మాతలు సూర్య ఆకొండి, మార్ని జానకిరామ చౌదరి స్థానిక దంటు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యాన వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో గుంటూరులో నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుభాషా వికాసంపై అంతర్జాతీయ లఘుచిత్ర పోటీలు నిర్వహించారని వివరించారు. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి బహుమతి సాధించిన ఏకై క చిత్రం తనదే కావడం చాలా సంతోషంగా ఉందని సూర్య అన్నారు. జానకిరామ చౌదరి మాట్లాడుతూ, ఆంధ్ర సాహిత్య పరిషత్ నేపథ్యంగా తీసిన చిత్రంలో తాను కూడా చక్కటి పాత్రలో నటించడంతో పాటు బహుమతి సాధించడం ఆనందకరమన్నారు. ఈ చిత్రంలో నటించిన రంగస్థల, సినీ నటులు కెర్ల పుల్లారావు, వర్ధమాన నటి సౌందర్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిని యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దంటు భాస్కరరావు, ఎన్.ప్రభుదాసు, పారిశ్రామికవేత్త గుబ్బల శ్రీనివాసరావు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు జోస్యుల కృష్ణబాబు అభినందించారు.
అన్నప్రసాద భవనానికి రూ.1.25 లక్షల విరాళం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కంకటాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, లక్ష్మీసుందరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.1,00,007, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన సత్తి కుమారి దంపతులు రూ.25,116 విరాళంగా అందజేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ పి.రాంబాబు దాతలకు స్వామివారి చిత్రపటాలను అందించారు.