
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కలెక్టరేట్‌కు వరకూ సాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అసోసియేషన్ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెన్ఫిట్ ఫండ్ కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.ఫృధ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్‌బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అర్హులైన న్యాయవాదులకు రూ.10 లక్షలు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.10వేలు చొప్పున ఐదేళ్ల పాటు స్టయిఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐ.ఎల్.ఏ. జిల్లా ఉపాధ్యక్షుడు కోలా శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేయాలన్నారు. ఐఎల్‌ఏ జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై.వసంతకుమారి మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగాలలో మహిళలకు రూల్ ఆఫ్ రిజర్వేషనన్ పాటించాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు, ఐ.ఎల్.ఏ. జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ గౌడ్, మంగం శివరామకృష్ణ, జె.వి.రమణ, ఎం.సరోజిని, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బి.వి.రమణ, చక్రవర్తి,అశోక్, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.