
సాయమందించి ప్రాణభిక్ష పెట్టండి
● ఏమి తిన్నా, తాగినా రక్తంతో కూడిన
వాంతులు
● ఆదుకోవాలంటూ దాతలకు వినతి
గండేపల్లి: ఆర్థిక సాయమందించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు దాతలను వేడుకుంటున్నాడు. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన గరగ నాగ ఆంజనేయ దుర్గారావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తల్లి అమ్మాజీ, భార్య గౌరీ పార్వతి, కొడుకు సూర్యగణేష్ ఉన్నారు. ఇతను రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఏమి తిన్నా, తాగినా వాంతులు కావడంతో కాకినాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లోను వైద్య పరీక్షలు చేయించగా కడుపులో పుండ్లు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే కొన్ని వైద్య పరీక్షలు ప్రైవేటుగా చేయించుకోవాల్సి వచ్చిందని అందుకు తగిన సొమ్ము లేకపోవడంతో చేయించుకోలేదన్నాడు. పుట్టపర్తిలో ఉచితంగా వైద్యం చేస్తారని తెలియడంతో అప్పట్లో కొందరు దాతల సహాయంతో రెండు సార్లు పుట్టపర్తి వెళ్లగా అక్కడి వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో తిరిగివచ్చేశానని, కాలక్రమేణ వ్యాధి ముదరడంతో మరింత నీరసించిపోతున్నానని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘన పదార్థం కడుపులోకి వెళ్లకపోవడంతో కనీసం ద్రవ పదార్థాలు తాగేందుకు వైద్యుల సూచనల మేరకు ఇంజెక్షన్ చేయించుకుంటున్నానని, అది మూడు రోజుల వరకు పనిచేస్తుందని దానివల్ల తాగిన ద్రవ పదార్థాలు వాంతి కాకుండా చేస్తుందన్నాడు. ఆ ఇంజెక్షన్ విలువ రూ.400 అని దానికి దాతలే సాయమందిస్తున్నట్టు తెలిపాడు. లివర్ స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్, గొట్టం పరీక్షలతోపాటు బ్లడ్ అవసరం ఉందని వైద్యులు చెప్పినట్టుగా పేర్కొన్నాడు. తన తల్లికి వస్తున్న పింఛన్ నుంచి సాయం చేస్తోందని తెలిపాడు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీకి వర్తించదని వైద్యులు చెప్పడంతో దాతల సాయం చేయాలని వేడుకుంటున్నాడు. సాయం అందజేసే దాతలు తన బ్యాంక్ అక్కౌంట్ (జెడ్ రాగంపేట యూనియన్ బ్యాంక్) 066910100082940 కు జమ చేయాలని వేడుకుంటున్నాడు.