
టీడీపీ సానుభూతిపరుడి గూండాగిరి
ఫ పేద కుటుంబంపై దాడికి యత్నం
ఫ ఇల్లు కబ్జా చేసేందుకు
కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు
కాకినాడ క్రైం: తన కుటుంబంపై టీడీపీ సానుభూతిపరుడు దౌర్జనానికి పాల్పడినట్లు ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటిని కబ్జా చేసే యత్నంలో భాగంగా బెదిరింపులకు దిగాడని చెబుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ 28వ డివిజన్‌లోని సూర్యనారాయణపురం జ్యోతులవారి వీధిలో మాన్యం నాగేశ్వరరావు తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. అతను సుమారు 15 ఏళ్ల కిందట గుండు సత్యవతిని చేరదీసి ఆలనా పాలనా చూశాడు. దీంతో ఆమె చనిపోయే ముందు (సుమారు రెండేళ్ల కిందట) జ్యోతులవారి వీధిలోని తన 54 గజాల ఇంటిని నాగేశ్వరరావుకు రాసిచ్చింది. దీంతో నాగేశ్వరరావు అక్కడకు మకాం మార్చాడు. ఇదిలా ఉండగా.. ఆ ఇల్లు తనదంటూ కొద్దిరోజుల కిందట టీడీపీ సానుభూతిపరుడు నగరమాని సతీష్ వాదనకు దిగాడు. సత్యవతి కుమార్తె అయిన సామర్లకోటలో నివాసం ఉంటున్న ఊడి పద్మ తనకు ఆ ఇంటిని విక్రయించిందని చెప్పుకొచ్చాడు. దానికి సాక్ష్యంగా కొన్ని పత్రాలు చూపాడు. అయితే అవివాహిత అయిన సత్యవతికి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని నాగేశ్వరరావు ప్రశ్నించడంతో సతీష్ ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి, పదిహేను రోజుల తర్వాత ఈ నెల 20న మరోసారి వచ్చి, సుమారు 20 మందితో మూక దాడికి యత్నించినట్లు బాధితుడు చెప్పాడు. వెంటనే స్థానికులు స్పందించి నాగేశ్వరరావు దంపతులను కాపాడారు. దీనిపై బాధితుడు మాట్లాడుతూ అసలు ఊడి పద్మ ఎవరు, సతీష్ చూపుతున్న ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పద్మ, సతీష్ అతడి అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకుని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అధికారులకు విన్నవించారు. తనకు జరిగిన అన్యాయంపై ఈ నెల 16న మున్సిపల్ అధికారులు, తహసీల్దార్, 19న కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 20 జరిగిన దాడిపై కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.