
పదవుల్లో నియామకాం
● ఒక్కొక్కరికీ రెండు పదవులా..
● జెండా మోసిన వారికి మొండిచెయ్యేనా!
● పార్టీ అధ్యక్షులపై అసమ్మతి సెగ
● తాడోపేడో తేల్చుకోవాలంటున్న సీనియర్లు
● జనసేనలో పదవుల ముసలం
సాక్షిప్రతినిధి, కాకినాడ: జనసేనలో జోడు పదవుల ముసలం రాజుకుంది. ఉన్న వారికే జోడు పదవులు ఇచ్చేస్తుంటే జెండా మోసిన వారు ఏమైపోతారంటూ అసమ్మతి సెగ తగిలింది. ఇదే సంస్కృతి కొనసాగితే వేరే దారి చూసుకుంటామని ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు చాలా కాలంగా కుతకుతలాడిపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం అనుకున్నారో ఏమో తెలియదు కానీ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతోన్న నేతలపై ధిక్కారస్వరం కాస్త గట్టిగానే వినిపించారు. పార్టీ పదవుల దగ్గర నుంచి అధికారిక పదవుల నియామకం వరకూ అన్నింటా ఆ ఇద్దరి పెత్తనాన్ని పార్టీ సీనియర్లు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానాన్ని పక్కదోవ పట్టించి ఒంటెద్దు పోకడలతో తమ అనుయాయులకే అగ్రాసనం వేస్తూ పార్టీ లో క్రమశిక్షణతో పనిచేస్తున్న నేతలకు అసలు ప్రాధాన్యం లేకుండా అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. గడచిన ఆరేడు నెలలుగా వేచిచూసే ధోరణిలో ఉన్న సీనియర్లంతా శనివారం రాత్రి కాకినాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవులు, ఒంటెద్దు పోకడలు అనే రెండు అంశాలే అజెండాగా ఈ సమావేశం నడిచిందని సమాచారం. పార్టీలో మత్స్యకార సామాజికవర్గం నుంచి కాకినాడ సూపర్‌బజార్ చైర్మన్ పెసింగి ఆదినారాయణ, మచ్చా గంగాధర్, పవన్‌కల్యాణ్ సామాజికవర్గం నుంచి డాక్టర్ చిట్లా కిరణ్, దుగ్గన బాబ్జీ, నల్లం శ్రీనివాస్ తదితర నేతలు కలిశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు)కి పార్టీ పదవితో పాటు జోడు పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు తొలుత కౌడా (కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన పెద్దాపురం సీటు పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్యాగం చేయాల్సి వచ్చింది.
అందుకు ప్రతిగా పార్టీ పగ్గాలు అప్పగించి ప్రభుత్వంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామనే హామీ పొందారు. ఈ క్రమంలోనే కౌడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఒకపక్క పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, మరోపక్క కౌడా జోడు పదవుల్లో బాబు కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులు చాలవా అన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవి కూడా బాబుకే కట్టబెట్టారు. ఇలా వరుసగా మూడు పదవులు ఒకరికే ఇవ్వాల్సి రావడాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి కంటే జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన మరో నాయకుడే లేకుండా పోయాడా అని కాకినాడ సమావేశంలో సీనియర్లు నిప్పులు చెరిగారని పార్టీ వర్గాల సమాచారం. డీసీసీబీ చైర్మన్ గిరీ ప్రకటించిన సందర్భంలో కౌడా చైర్మన్ పదవికి తుమ్మల రాజీనామా చేసినట్టు జనసేన సోషల్‌మీడియా గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. కౌడా చైర్మన్ పదవి మరొకరికి దక్కుతుందని ఆశావహులు గంపెడాశతో ఎదురుచూశారు. అనంతరం కౌడాకు చైర్మన్ పీఠం ఎవరికీ ఖరారు కాకపోవడంతో జోడు పదవులు బాబు గుప్పెట్లోనే ఉన్నాయని తేలిపోయింది. ఆ క్షణం నుంచి పార్టీ కోసం పనిచేస్తోన్న కీలక నేతలంతా మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ నియామకం ఒక్కటే చాలదా అన్నట్టు అదే సామాజికవర్గం నుంచి పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడిగా తోట సుధీర్ నియామకంపై కూడా ఆదిలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివిధ సామాజికవర్గాల్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా వ్యయప్రయాసలు ఎదుర్కొన్న వారున్నా సుధీర్‌నే ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని అప్పట్లో పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయినా ఇవేమీ లెక్క చేయకుండా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పౌరసరఫరాల సంస్థకు చైర్మన్ పదవి కూడా తోటకే అప్పగించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నియామకాలపై నేతల్లో అంతర్లీనంగా ఉన్న ఆగ్రహమే తాజా భేటీకి దారి తీసిందంటున్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌తో ఉన్న బంధుత్వమే తోటకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా పార్టీలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులతో పార్టీ నేతలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారనే అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్న సీనియర్లు కాస్తా ఇక ముందు తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం అప్పటికీ చలనం లేకుంటే రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చివరకు ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే.

పదవుల్లో నియామకాం

పదవుల్లో నియామకాం