
కిటకిటలాడిన పాదగయ క్షేత్రం
పాదగయ క్షేత్రంలో భారీగా పిండ ప్రదానాలు
పిఠాపురం: త్రిగయలలో ప్రాధాన్యం కలిగిన పిఠాపురం పాదగయ క్షేత్రం గయాసురుని పాదాలు ఉండడం వల్ల పితృకార్యాలకు అత్యంత విశిష్టమైందిగా పేరొందింది. మహాలయ అమావాస్య కావడంతో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి పితృకార్యాలు నిర్వహించారు. మహాలయ పక్షం పితృ దేవతలకు మోక్షం అనే నమ్మకంతో భక్తులు పాదగయ క్షేత్రంలో భారీగా పిండప్రదానాలు చేశారు. దీంతో పాదగయ క్షేత్రం పిండ ప్రదానాలతో కిటకిటలాడింది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసేందుకు తరలివచ్చారు. తద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. పాదగయ క్షేత్రంలో గయాసురుని పాదాలు ఉండడం వల్ల ఇక్కడ పితృకర్మలు చేసి పిండాలు గయాసురుని పాదాలు ఉన్న పాదగయ పుష్కరిణిలో వదిలితే అవి నేరుగా పితృదేవతలకు చేరుతాయని భక్తుల విశ్వాసమని పురాణ గాధలు చెబుతున్నాయి. అన్ని చోట్ల పితృ కర్మలు చేసుకునే వీలు ఉన్నా ఈ క్షేత్రానికి మాత్రం పితృమోక్షకరమైన క్షేత్రంగా పేరుండడంతో ఇక్కడ చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. అందువల్లే ఏటా మహాలయ పక్షంలో ఈ క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో 20 నుంచి 50 వరకు పిండప్రదానాలు జరిగితే మహాలయ పక్షం రోజుల్లో మాత్రం రోజుకు వెయ్యికి పైగా జరుగుతుంటాయి. అందువల్ల ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఇక అమావాస్య ఆదివారం కావడంతో సుమారు 3 వేల మందికి పైగా భక్తులు పిండప్రదానాలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులతో పాటు పిండ ప్రదానాలు చేయించుకునే భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామని, పిండప్రదానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ప్రాంగణంతో పాటు పాదగయ పుష్కరిణి చుట్టూ షామియానాలు వేయించి తగిన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు.