
సత్యదేవునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● ఆలయ ప్రాకారంలో ఊరేగింపు
● స్వామిని దర్శించిన 30 వేల మంది భక్తులు
● ఆదాయం రూ.30 లక్షలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్బంగా శనివారం స్వామి, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూలవిరాట్‌లకు పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేకపూజలు, ఆయుష్యహోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి సుప్రభాత సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవారు, శంకరులు మూలవిరాట్‌లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో స్వామికి ఆయుష్య హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు కోట వంశీ, వేదపండితులు యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభిరామ్మూర్తి, పరిచారకుడు యడవిల్లి ప్రసాద్ తదితరులు నిర్వహించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు.
ఐదు వేల మందికి అన్నదానం
శనివారం సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని సర్వదర్శనానికి గంట, రూ.200 టికెట్‌పై అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. 1,600 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది అన్నదానం స్వీకరించారు.