
7న పంచారామ క్షేత్రం మూసివేత
సామర్లకోట: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయం మూసి వేయనున్నట్టు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రగ్రహణం వీడిన తరువాత సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. భక్తులు ఈ అసౌకర్యాన్ని గమనించాలన్నారు. అలాగే అతి పురాతన విష్ణు ఆలయం మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి సోమవారం ఉదయం 9.30 గంటలకు తెరవనున్నట్టు ఆలయ ఈఓ బిక్కిన వెంకట్రాయచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పట్టణ, మండల పరిధిలోని అన్ని దేవాలయాలను మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు మూసి వేయనున్నట్టు ఆయా ఆలయాల కమిటీ నాయకులు తెలిపారు.
ఆందోళనకరంగా
భూగర్భ జలాలు
భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్
నల్లజర్ల: మండలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటాయని, తక్షణం నీటి సంరక్షణ చేపట్టకపోతే ఈ ప్రాంతంలోని పంట భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమై భూగర్భ జలాల సంరక్షణ – పెంపుపై చర్చించారు. డీడీ మాట్లాడుతూ భూగర్భ జలమట్టాలు 20 అడుగుల నుంచి 50 అడుగుల లోతుకు తగ్గిపోయాయని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇక్కడ వ్యవసాయమంతా బోరుబావులపైనే ఆధారపడి జరుగుతోందన్నారు. ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో వ్యవసాయం, తోటల పెంపకంలో డ్రిప్, స్పింక్లర్లు వినియోగం పెరిగి నీటి వినియోగం తగ్గాలన్నారు. రీచార్జి పిట్‌లు, ఫారంపాండ్స్, రింగ్ ట్రెంచ్‌లు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందన్నారు. డ్వామా ఏపీడీ బి.రాంప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితిలో ప్రణాళిక బద్ధంగా ఈ పనులు చేపట్టి, పురోగతి సాధించవచ్చన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు రానున్న ఐదేళ్లలో తమ పొలాల్లో ఫారంపాండ్లు, రింగ్ ట్రెంచ్‌లు ఏర్పాటు చేసుకుని, భూమిలో తేమశాతం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం ద్వారానే జరుగుతాయని వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి మల్లికార్జునరావు, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రత్నకుమారి, నీటిపారుదలశాఖ డీఈ మనోజ్ కుమార్, మండల పరిషత్ ఏఓ మహాలక్ష్మి మంగతాయారు, ఉద్యానశాఖ అధికారి బబిత, వ్యవసాయాధికారి సోమశేఖరం, ఏపీఓ త్రిమూర్తులు పాల్గొన్నారు.
కాటన్ బ్యారేజీకి
తగ్గిన వరద ఉధృతి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి బుధవారం మరింత తగ్గింది. ఉదయం నుంచి క్రమేపి తగ్గుతూ వచ్చి.. రాత్రి 8 గంటలకు 10.70 అడుగులకు చేరింది. అయితే ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో మరో రెండు రోజుల పాటు కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 11.20 మీటర్లు, పేరూరులో 15.85 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.57 మీటర్లు, భద్రాచలంలో 41.80 అడుగులు, కూనవరంలో 17.48 మీటర్లు, కుంటలో 9.40 మీటర్లు, పోలవరంలో 11.65 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.70 మీటర్ల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.

7న పంచారామ క్షేత్రం మూసివేత