
ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్న చంద్రబాబు
● జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీల్లో
10 అమ్మేయడం ఏమిటి?
● ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ భరత్‌రామ్
మండిపాటు
రాజమహేంద్రవరం సిటీ: అపారమైన అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాకుండా జగనన్న తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చూడటం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ ిసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి, ఏ ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని మినహాయించి, లేని ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో రాజమహేంద్రవరం వంటి ఐదు ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమయ్యాయన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా 35 ఎకరాల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ప్రారంభిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిన్నర కాలంలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మొదటి బ్యాచ్ పూర్తయి డాక్టర్లు బయటకు వచ్చే సమయానికి కూడా భవన నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం 99 ఏళ్లకు అమ్మేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాయడానికి చంద్రబాబుకి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఎవరైనా మెడికల్ కాలేజీలు పెడతామన్నా, సీట్లు పెంచుతామన్నా ఆనందంగా ముందుకు వస్తారని, అయితే చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచొద్దని లేఖ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నిర్వీర్యం చేసి, తద్వారా పేదలకు వైద్యం అందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉందని భరత్‌రామ్ ధ్వజమెత్తారు.