
ఉపాధ్యాయ వృత్తి మహోన్నతం
– కలెక్టర్ షణ్మోహన్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమాజంలో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వత్తి మహోన్నతమైనదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ జేఎన్టీయూ అల్లూమ్ని ఆడిటోరియంలో గురుపూజోత్సవం –2025 కార్యక్రమం జరిగింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ బోధనలతో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు మానసిక దఢత్వాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ సమాజానికి మూల స్తంభాల వంటి వారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ.. సమాజ ఉన్నతికి పాటుపడుతున్న ఉపాధ్యాయులందరూ ఉత్తమ గురువులేనని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు దక్కుతుందన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పూర్వం ఉపాధ్యాయ వృత్తిని బతకలేక బడిపంతులు అనే వారిని.. నేడు బతుకు నేర్పే వృత్తిగా గుర్తింపు సాధించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ నాగార్జున, డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.