
రేపు మధ్యాహ్నం వరకే సత్యదేవుని దర్శనం
అన్నవరం: భాద్రపద పౌర్ణిమ, ఆదివారం రాత్రి 9–50 గంటలకు ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారని ఈఓ వీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల వరకు మాత్రమే స్వామివారి వ్రతాలు, కేశఖండన టిక్కెట్లు విక్రయిస్తారు. ఉదయం 12 గంటల వరకు మాత్రమే వ్రతాలు నిర్వహిస్తారు. స్వామివారి నిత్యకల్యాణం, వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం ఉదయం 11 గంటల లోపు పూర్తి చేస్తారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను వ్రతాలు, దర్శనాలు, ఇతర పూజా కార్యక్రమాలకు అనుమతిస్తారని తెలిపారు.
ఆక్వా రంగాన్ని కాపాడండి
బోట్‌క్లబ్ (కాకినాడ): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 50 శాతం సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా, కార్మికుల తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని, సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జిల్లా నుంచి ఎగుమతి అవుతున్నాయన్నారు. కోనపాపపేట సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన హేచరీస్, జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆక్వా ఫీడ్ తయారీ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలో సుమారు లక్షమంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారన్నారు. ఆక్వా సాగు యంత్రాలు, మందులు అమ్మే దుకాణాల ద్వారా మరో 50 వేలమంది పరోక్ష ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ సంక్షోభం కారణంగా అనేక చిన్న యూనిట్లు మూసివేశారని, నెక్కంటి, దేవి, అవంతి, అపెక్స్ వంటి పెద్ద యూనిట్లలో ఉత్పత్తిని 50 శాతానికి పరిమితం చేసి ఆ మేరకు కార్మికులను తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి కావలసిన విదేశీ మారకద్రవ్యం ఈ ఆక్వా ఎగుమతుల ద్వారా వస్తుందని, ఇప్పుడు అది సుంకాల ప్రభావంతో పడిపోయిందన్నారు.
కోటసత్తెమ్మ ఆలయం
రేపు మూసివేత
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం కోటసత్తెమ్మ అమ్మవారికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు మూసివేసి తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన పేర్కొన్నారు.
వినాయక లడ్డూ రూ.36,500
అమలాపురం రూరల్: మండలంలో బండారులంక, మట్టపర్తివారిపాలెంలో నిలబెట్టిన సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి 15 కేజీల మహాలడ్డూను వేలంపాటలో రూ.36,500లకు డి.రవితేజ, వెంకటలక్ష్మి, తులసి అర్జున్, దివ్య దంపతులు దక్కించుకున్నారు. పాటదారులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు సత్కరించి లడ్డూను అందించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడలి రాజు, కడలి రావకృష్ణ, బొంతు శ్రీనుబాబు, మట్టపర్తి అజయ్ కుమార్, మామిడిశెట్టి విష్ణు ప్రసాద్, మట్టపర్తి రాంబాబు, మట్టపర్తి కృష్ణ నాగేంద్ర, రాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముస్లింల శాంతి ర్యాలీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రవక్త ప్రవచనాలను వినిపిస్తూ, ధార్మిక నినాదాలు చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో 40 ఏళ్లుగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది మహ్మద్ ప్రవక్త జన్మించి 1,500వ సంవత్సరం కావడం విశేషమన్నారు.