ముమ్మరంగా పొగాకు నారుమడులు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా పొగాకు నారుమడులు

Sep 6 2025 5:31 AM | Updated on Sep 6 2025 5:31 AM

ముమ్మ

ముమ్మరంగా పొగాకు నారుమడులు

65 హెక్టార్లలో నర్సరీలు

దసరా నుంచి నాట్లకు సన్నాహాలు

ట్రే నర్సరీలపై రైతుల ఆసక్తి

70 వేల ఎకరాల్లో పంట సాగు

దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2025–26 పంట కాలానికి పొగాకు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన నారును నర్సరీల్లో విత్తనం వేసి పెంచుతున్నారు. బోర్డు నిబంధనల మేరకు రైతులు, వ్యాపారులు నారుమడులు కట్టి పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నారుమడి దశ నుంచి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే రైతులు తప్పనిసరిగా బోర్డులో నర్సరీని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలసి ఉంది. పొగాకు పంట సాగు చేసే రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యాపారులు, రైతుల నుంచి నారు కొనుగోలు చేయవలసి ఉంది. నారు అమ్మిన రైతు నుంచి నారు కొనుగోలు సమయంలో రశీదు తీసుకుని బోర్డు కార్యాలయంలో మొక్క ఫారంతో పాటు అధికారులకు అందజేయవలసి ఉంది. ప్రస్తుతం పొగాకు నారుమడులు ముమ్మరంగా కడుతున్నారు.

నర్సరీల విస్తీర్ణం పెరిగే అవకాశం

దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 65 హెక్టార్లలో పొగాకు నర్సరీలు వేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో సుమారు 34 హెక్టార్లు కమర్షియల్‌, 21 హెక్టార్లు డొమెస్టిక్‌ నర్సరీలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు నర్సరీల విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, దేవరపల్లి, బందపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో ఎక్కువగా పొగాకు నారుమడులు కడుతున్నారు. పల్లంట్ల, దేవరపల్లి, లక్ష్మీపురం, బందపురం గ్రామాల్లో కమర్షియల్‌ నర్సరీలు కడుతున్నారు. కమర్షియల్‌ నర్సరీలు కట్టేవారిలో 90 శాతం కౌలుదారులు ఉన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు, కాపవరం, ధర్మవరం, తాళ్లపూడి మండలం మలకపల్లి, ప్రాంతాల్లో కమర్షియల్‌ నారుమడులు కడుతున్నారు. ఇక్కడ వేసిన నారుకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళతారు. ఎకరం విస్తీర్ణంలో పెంచిన నారు సుమారు 1,200 ఎకరాల్లో సాగుకు సరిపోతుందని రైతులు తెలిపారు.

ట్రే నారుపై రైతుల ఆసక్తి

ట్రేలలో పెంచిన నారుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ట్రే నారు ఆరోగ్యకరంగాను, ధృడంగా ఉండి నాటిన అనంతరం చీడపీడలను తట్టుకుంటుందని రైతులు తెలిపారు. పొగాకు సాగు చేసే రైతులంతా ట్రే నారుపై మొగ్గు చూపుతున్నారు. ట్రే నారు ధర ఎక్కువగా ఉన్నప్పటికి రైతులంతా దీనినే కొనుగోలు చేస్తారు. ఏటా దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు.

అధిక దిగుబడుల వంగడాలు సాగు

అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలను సీటీఆర్‌ఐ, ఐటీసీ సంస్థలు రైతులకు సరఫరా చేస్తున్నాయి. కిలో విత్తనాలకు వంగడాన్ని బట్టి రూ.15 వేలు ధర ఉంది. ఎల్‌వీ–7, 1353 వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు సుమారు 10 నుంచి 13 క్వింటాళ్లు పొగాకు దిగుబడి వస్తున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

బోర్డు నిబంధనలు ఉల్లంఘించి పొగాకు నర్సరీలు వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది నర్సరీ దశ నుంచి నిబంధనలు కఠినతరం చేశాం. నర్సరీ వేసే ప్రతి రైతు బోర్డు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. నర్సరీల తనిఖీకి బోర్డు బిజిలెన్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్‌ ఉన్న నర్సరీల నుంచి రైతులు నారు కొనుగోలు చేయాలి. నారు అమ్మిన వ్యాపారి నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలి. రశీదు పుస్తకాలను బోర్డు ద్వారా నర్సరీ యజమానులకు అందజేస్తున్నాం. అక్టోబర్‌ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి.

– జీఎల్‌కే ప్రసాద్‌, పొగాకు బోర్డు

రీజినల్‌ మేనేజర్‌, రాజమహేంద్రవరం

ముమ్మరంగా పొగాకు నారుమడులు1
1/2

ముమ్మరంగా పొగాకు నారుమడులు

ముమ్మరంగా పొగాకు నారుమడులు2
2/2

ముమ్మరంగా పొగాకు నారుమడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement