
చండీ హోమం నిలిపివేత
● సత్యదేవుని కల్యాణోత్సవాల వేళ భక్తులకు నిరాశ
● నిర్వహణకు రుత్విక్కులు లేరన్న
వైదిక కమిటీ
● గతంలో సరిపోయి, ఇప్పుడు
ఎందుకు సరిపోరని ప్రశ్న
● వెలవెలబోయిన వనదుర్గ ఆలయం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఏడాదికో రూలు పాటిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా 2023, 2024 సంవత్సరాల్లో రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలను దేవస్థానం పండితులు యథావిధిగా నిర్వహించారు. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో మాత్రం ఇతర వైదిక కార్యక్రమాలతో పాటు అమ్మవారి హోమాలు కూడా నిలుపు చేశారు. దీంతో, శుక్రవారం జరగాల్సిన చండీ హోమం జరగలేదు. ఈ విషయం తెలియక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చండీ హోమం నిర్వహించడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. ఈ నెల 12న పౌర్ణమి నాడు జరగాల్సిన ప్రత్యంగిర హోమం కూడా నిలుపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇలా ఎందుకు నిలుపు చేశారని వైదిక కమిటీలోని పండితులను అడిగితే హోమాల నిర్వహణకు రుత్విక్కులు చాలరని ఒకరు.. స్వామివారి కల్యాణ మహోత్సవాల సమయంలో మరే ఇతర కార్యక్రమాలూ జరగకూడదని మరొకరు చెబుతున్నారు. గతంలో జరిగాయని అడిగితే అప్పుడు చేశారు కానీ, ఇప్పుడు నిలిపివేశామని అంటున్నారు.
అన్నీ తెలిసిన వారుంటే..
వాస్తవానికి సత్యదేవుని కల్యాణోత్సవాలు నిర్వహించినప్పుడు ఇప్పటిలా గతంలో ఎప్పుడూ హోమాలు నిలిపివేయలేదు. గతంలో కరోనా సమయంలో సైతం హోమాలు నిర్వహించారు. భక్తుల్ని మాత్రం అనుమతించలేదు. 2023లో దేవదాయ శాఖ సీనియర్ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఉన్నారు. ఆయన ఊరుకోరనే ఉద్దేశంతో అప్పట్లో హోమాలు నిలుపు చేయలేదు. అలాగే, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గత ఏడాది ఈఓగా ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. అందువలన అప్పుడు కూడా హోమాలు నిలుపు చేయలేదు. ఈసారి మాత్రం వనదుర్గ అమ్మవారి హోమాలు నిలుపు చేయాలని పండితులు చెప్పగానే ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పండితులు సలహా ఇచ్చినా గతంలో కల్యాణోత్సవాల సందర్భంగా ఈ హోమాలు నిర్వహించారో లేదో పరిశీలిస్తే వాస్తవం తెలిసి ఉండేది.
పూర్వపు దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్‌కు వనదుర్గ అమ్మవారంటే ఎంతో భక్తి. 1995లో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ సమయంలో వనదుర్గ అమ్మవారి మూలవిరాట్టును కదిపి బాలాలయంలో పెట్టారు. ఆ సమయంలో కొన్ని అపచారాలు జరిగాయి. అప్పట్లో రామ్‌కుమార్ పదవికి కోర్టు ద్వారా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆయన అమ్మవారి కార్యక్రమాల్లో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఒప్పుకునేవారు కాదు. ఒకవేళ ఆయన ఇప్పుడు ఉండి ఉంటే వనదుర్గ అమ్మవారి హోమాలు నిలిపివేయడానికి అంగీకరించి ఉండేవారు కాదని పలువురు అంటున్నారు. ప్రస్తుత చైర్మన్ ఐవీ రోహిత్‌కు అంత అనుభవం లేకపోవడంతో చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో అన్నీ తెలిసిన వారుంటే ఒకలా.. ఏమీ తెలియని వారుంటే మరోలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ వస్తోంది.
గతంలోనూ..
చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా ఉన్నప్పుడు క్యూ లైన్ కోసం పాత నివేదన శాలను తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పట్లో నివేదన శాలకు భూస్పర్శ లేకపోయినా ఫర్వాలేదని చెప్పి సర్క్యులర్ మండపం పై అంతస్తు మీద దాత చేత నివేదన శాల నిర్మింపజేశారు. అలాగే, జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం నిర్వహణపై ఆజాద్‌కు లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చారు. ఈ వ్రతం నిర్వహణకు రూ.30 లక్షలతో అకౌంట్స్ సెక్షన్ కార్యాలయాన్ని మండపంగా మార్చి, ఏసీలు కూడా ఏర్పాటు చేయించారు. ఆజాద్ తరువాత రామచంద్ర మోహన్ ఈఓగా వచ్చాక సర్క్యులర్ మండపం పైనున్న నివేదన శాలలో నివేదనలు చేయడం తప్పని, నివేదన శాలకు భూస్పర్శ ఉండాలని, అలాగే, జ్యోతిర్మయి వ్రతం చేయకూడదని పండితులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికై నా 12వ తేదీన ప్రత్యంగిర హోమం నిలుపుదలను పునఃపరిశీలించాలని భక్తులు కోరుతున్నారు.

చండీ హోమం నిలిపివేత