గేట్లు.. పాట్లు | - | Sakshi
Sakshi News home page

గేట్లు.. పాట్లు

Mar 8 2025 12:11 AM | Updated on Mar 8 2025 12:10 AM

అన్నవరం: పంపా రిజర్వాయర్‌ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ పరిస్థితి

పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్‌లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్‌కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్‌లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్‌ పంట కాలంలో రిజర్వాయర్‌ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది.

తాత్కాలిక మరమ్మతులతో సరి

అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్‌ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్‌ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్‌ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్‌ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే మంజూరు

రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్‌ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2023 డిసెంబర్‌లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్‌ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్‌లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు.

ఫ పంపా రిజర్వాయర్‌

కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు

ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు

ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే

మురిగిపోయే అవకాశం

త్వరలోనే కొత్త గేట్లు

నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్‌ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం.

– జి.శేషగిరిరావు, ఇరిగేషన్‌ ఈఈ

గేట్లు.. పాట్లు1
1/1

గేట్లు.. పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement