దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్ ఐవీ రోహిత్ తీర్మానాలు
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని 260 మంది వ్రత పురోహితుల పారితోషికాన్ని నెలకు రూ. రెండు వేలు చొప్పున, విశ్రాంత వ్రతపురోహితుల పెన్షన్‌ను రూ.వేయి చొప్పున పెంచేందుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన గల ఏకసభ్య ధర్మకర్తల మండలి శుక్రవారం తీర్మానించింది. ధర్మకర్తల మండలి పదవీ కాలం గత ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆలయ చైర్మన్ హోదాలో రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలిసి శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. గతంలో దేవస్థానం వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు ఆధ్వర్యంలో వ్రత పురోహితులు దేవస్థానం చైర్మన్, ఈఓలకు సమర్పించిన వినతి మేరకు తీర్మానం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించినట్టు చైర్మన్ రోహిత్ తెలిపారు.
మిగిలిన తీర్మానాలివీ..
● సత్యదేవుని ప్రసాదం తయారీకి ఆవునెయ్యి కిలో రూ.590 చొప్పున విజయ డైరీ, సంగం డైరీల నుంచి కొనుగోలు చేయడం.
● రూ.1.2 కోట్లతో ప్రకాష్‌సదన్, న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ కాటేజీల మరమ్మత్తులు.
● దేవస్థానంలో 123 సీసీ కెమేరాల ఏర్పాటుకు కొటేషన్ల ఆమోదం.
● దేవస్థానం ఆసుపత్రి కి రూ.3.75 లక్షలతో రంగులు, కేశఖండన శాలలో రూ.తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో మరమ్మత్తులు.
● మే నెలలో జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు రూ.22 లక్షలతో ఆలయం, ఇతర భవనాలు, మండపాలకు రంగులు వేయించడం.
● ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం కోరుకొండ లక్ష్మీ నర్శింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలకు రూ.11.40 లక్షలతో ఏర్పాట్లు.
సమావేశంలో దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్‌రావు, ఏఈఓలు జగ్గారావు, కొండలరావు, కృష్ణారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.