ఆటల పండగకు రెడీ | - | Sakshi
Sakshi News home page

ఆటల పండగకు రెడీ

Dec 11 2023 2:02 AM | Updated on Dec 11 2023 2:02 AM

- - Sakshi

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఆటల పండగకు సర్వం సిద్ధం అవుతోంది. గ్రామీణ స్థాయి నుంచీ వివిధ క్రీడల్లో ప్రతిభ చూపేవారిని గుర్తించి, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన జరుగుతున్న ఈ పోటీల నిర్వహణకు అధికార యంత్రాంగం శరవేగంతో అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. మరోవైపు గ్రామీణ స్థాయి నుంచి పలువురు క్రీడాకారులు ముమ్మరంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. గ్రామ/వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో 620, మండల స్థాయిలో 21, నియోజవర్గ స్థాయిలో 7 కేంద్రాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిల్లో 12 రోజులు, మండల స్థాయిలో 12 రోజులు, నియోజకవర్గ స్థాయిలో 9 రోజులు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చెరో 8 రోజుల చొప్పున ఈ పోటీలు జరుగుతాయి. దీంతో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్రీడా పండగ వాతావరణం నెలకొననుంది.

ఏయే పోటీలంటే..

ప్రతి స్థాయిలోనూ క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో పోటీలు 17 సంవత్సరాలు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా జరుపుతారు. అలాగే, సంప్రదాయ క్రీడల్లో భాగంగా యోగా, 3కే మారథాన్‌, టెన్నికాయిట్‌, ఆయా ప్రాంతాలకు చెందిన సంప్రదాయ క్రీడలను ప్రతి స్థాయిలోనూ నిర్వహిస్తారు.

13 వరకూ గడువు

ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 1,08,200 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఈ నెల 13వ తేదీ. అప్పటికి రిజిస్ట్రేషన్‌ చేసుకునే క్రీడాకారుల సంఖ్య 1,41,360కి చేరుతుందని క్రీడాభివృద్ధి అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహణలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థతో పాటు పాఠశాల విద్య, ఉన్నత విద్య, గ్రామ/వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్యం, సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమం, మున్సిపల్‌ పరిపాలన విభాగం, సమాచార, పౌర సంబంధాల శాఖలు భాగస్వాములు అవుతాయి.

ఉచితంగా స్పోర్ట్స్‌ కిట్‌లు

గ్రామ/వార్డు సచివాలయాలతో పాటు మండల స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రభుత్వం బేసిక్‌ స్పోర్ట్స్‌ కిట్‌లు అందిస్తోంది. క్రికెట్‌లో పురుషులకు 2, మహిళలకు 1 చొప్పున, బ్యాడ్మింటన్‌లో పురుషులకు 4, మహిళలకు 4, వాలీబాల్‌లో పురుషులకు 2, మహిళలకు 2 చొప్పున స్పోర్ట్స్‌ కిట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ కిట్‌లు సచివాలయ, మండల స్థాయికి చేరుకున్నాయి. నియోజవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్‌ ఆడే క్రీడాకారులకు ప్రొఫెషనల్‌ కిట్‌లు ఇవ్వనుంది.

పోటీల వేదికలివే...

గ్రామీణ స్థాయి క్రీడా పోటీలకు ప్రభుత్వ పాఠశాలలు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు వేదికలుగా నిర్ణయించారు. మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వ కళాశాలల ఆటస్థలాలు; నియోజకవర్గ స్థాయిలో కళాశాలలు, యూనివర్సిటీ, మున్సిపల్‌ స్టేడియాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో కళాశాలలు, జిల్లా క్రీడా మైదానాలను ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియం, జీవీఎంసీ స్పోర్ట్స్‌ ఎరీనా, ఆంధ్రా యూనివర్సిటీ క్రీడా ప్రాంగణాలను వేదికలుగా నిర్ణయించారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను జిల్లాలో విజయవంతంగా ని ర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియా పలుమార్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఇతర శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, పలు సూచనలు, సలహాలు అందించారు. ఇప్పటికే సచివాలయ, మండల స్థాయిల్లో స్పోర్ట్స్‌ కిట్‌లు సిద్ధంగా ఉంచాం. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ముందుగా

www.adudhamandhra.ap.gov.in/aa.registraion

వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆధార్‌, ఫోన్‌ నంబర్లు నమోదు చేయాలి. ఒక్కో క్రీడాకారుడు రెండు క్రీడాంశాల్లో పాల్గొనవచ్చు. వెబ్‌సైట్‌లో నమోదు కుదరని పక్షంలో 1902 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి కూడా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

– శ్రీనివాస్‌ కుమార్‌,

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి

15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు

ఇప్పటికే 1,08,200 మంది క్రీడాకారుల నమోదు

గడువు ముగిసేనాటికి 1.41

లక్షలకు చేరుతారని అంచనా

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement