
సభలో మాట్లాడుతున్న గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రసాద్
పుస్తక పఠనంపై ఆసక్తి పెరగాలి
ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ
కార్యదర్శి ప్రసాద్
అమలాపురం టౌన్: పుస్తక పఠనంపై నేటి విద్యార్థులు మరింతగా ఆసక్తి పెంచుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీఎల్‌ఎన్‌ఎస్‌వీ ప్రసాద్ అన్నారు. దీనికోసం ప్రతి విద్యార్థీ తమకు అందుబాటులో గ్రంథాలయాలను విధిగా వినియోగించుకోవాలని సూచించారు. ఖాళీ దొరికినపుడు పుస్తకాలు చదివేందుకు సమయం కేటాయించాలని అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం అమలాపురంలోని ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు తరగతి గదుల్లో నాలుగు గోడల మధ్య కూర్చుని సముపార్జించే విజ్ఞానానికి సార్థకత రావాలంటే పుసక్త పఠనం అలవర్చుకోవాలని ప్రసాద్ అన్నారు. కాలం ఎంతటి ఆధునికత దిశగా వెళ్తున్నా.. గ్రంథాలయాల విలువ శాశ్వతమైనదని అన్నారు. అనంతరం దేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి, మహిళా సాధికారతపై జరిగిన సభలో ప్రసాద్ ప్రసంగించారు. సమాజంలో మహిళలు సాధిస్తున్న విజయాల పరంపరను వివరించారు. గ్రంథాలయాధికారి పోలిశెట్టి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సాయి సంజీవిని మహిళా వాకర్స్ యోగా ఆరోగ్య సంస్థ అధ్యక్షురాలు జల్లి సుజాత, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, సామాజిక కార్యకర్త మెహబూబ్ షకీలా తదితరులు కూడా ప్రసంగించారు.