
లోవ ప్రాంగణంలో వంటలు, భోజనాలు చేస్తున్న భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని తలుపులమ్మ అమ్మవారిని ఎనిమిది వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ సూపరింటెండెంట్ మూర్తి తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.72,240, పూజా టికెట్లకు రూ.37,580, కేశఖండన టికెట్ల అమ్మకం ద్వారా రూ.6,520, వాహన పూజలకు రూ.4,510, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.9,950, విరాళాలుగా రూ.1,37,326 కలిపి అమ్మవారికి రూ.2,68,126 ఆదాయం సమకూరింది. కాగా, తలుపులమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, మహా మండప నిర్మాణానికి శ్రీకాకుళానికి చెందిన భక్తురాలు అయ్యపురెడ్డి ఛాయారాణి రూ.50,101 విరాళం సమర్పించారు.
సమసమాజానికి కృషి చేసిన మహనీయుడు ఆవంత్స
పిఠాపురం: సమసమాజ స్థాపనకు 82 ఏళ్ల పాటు తన రచనల ద్వారా పాటుపడిన మహోన్నతుడు ఆవంత్స సోమసుందర్ అని అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఆవంత్స సోమసుందర్ లిటరసీ ట్రస్టు ఆధ్వర్యాన పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆవంత్స శత జయంత్యుత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నిబద్ధత కలిగిన రచయితగా సమాజ మార్పు కోసం ఆవంత్స రచనలు చేశారని అన్నారు. మరో ముఖ్య అతిథి అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివ ప్రసాద్ మాట్లాడుతూ, మనిషిని నడిపించేది ఒకటి సైన్సు అయితే రెండోది సాహిత్యం అని అన్నారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడంలో ఆవంత్స సోమసుందర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సాహిత్యానికి, కళలకు నేటి యువత దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతరం సోమసుందర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చెలికాని స్టాలిన్, పీఆర్ ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భరతలక్ష్మి, సహృదయ మిత్ర మండలి సభ్యులు పి.పావని, యువ రచయిత కిలారి గౌరీనాయుడు, రచయిత గౌరవ్, సోమసుందర్ లిటరసీ ట్రస్టు సభ్యులు డాక్టర్ గజరాజు సీతారామస్వామి, మేకా మన్మథరావు, ఆవంత్స విజయ శేషేంద్ర, శాతకర్ణి, గట్టి శ్రీకృష్ణదేవరాయలు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, తటవర్తి సుబ్బారావు, సాహిత్య అభిమానులు, కళాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అరసం జాతీయ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ