
వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17, 19 ఆధ్వర్యాన జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల లాన్ టెన్నిస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ నాగమణి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడల్లో రాణించేవారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడారులు స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఆర్‌జేడీ నాగమణి మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యాన అండర్–19 జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు కాకినాడలో జరగనున్నాయని తెలిపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, అండర్–14, 17 లాన్ టెన్నిస్ పోటీలు క్రీడా మైదానంలోని టెన్నిస్ కోర్టుల్లోను, అండర్–19 పోటీలు రాజేష్ టెన్నిస్ అకాడమీ ప్రాంగణంలోని టెన్నిస్ కోర్టుల్లోను జరుగుతాయని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి పద్మశ్రీ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. డీఎస్‌ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్, ఒలింపిక్ సంఘ చీఫ్ ప్యాట్రన్ భామిరెడ్డి, ఏపీ లాన్ టెన్నిస్ సంఘ కార్యదర్శి కుమార్, హెచ్‌ఎం రంగారావు, పీడీలు రవిరాజు, బంగార్రాజు, శ్రీహరిరాజు, రాష్ట్ర పరిశీలకుడు బాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
ఎస్‌జీఎఫ్‌ఐ లాన్ టెన్నిస్
పోటీలు ఘనంగా ప్రారంభం

క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పద్మశ్రీ